భిక్కనూర్‌కు అన్యాయం.. రూ.200 కోట్ల విద్యా వరం ఎందుకు తరలింపు?
భిక్కనూరు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివారుకు తరలించే ప్రతిపాదనపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బిక్కనూర్ మండలంలో పాఠశాల కోసం ఇప్పటికే స్థల పరిశీలనలు జరిగాయి. పోతులగుట్టతో పాటు సిద్ధరామేశ్వర స్వామి ఆలయం వెనుక ప్రాంతాన్ని కూడా అధికారులు పరిశీలించినట్లు సమాచారం.
పరిశీలించిన స్థలాలు అనుకూలంగా లేకపోతే వాటిని తిరస్కరించడంలో అభ్యంతరం లేదు. కానీ ఆ కారణంతో మొత్తం ప్రాజెక్టును బిక్కనూర్ మండలం వెలుపలకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు పెద్ద విస్తీర్ణంలో స్థలం అవసరం. రహదారి, నీరు, విద్యుత్, భద్రత, రవాణా, భవిష్యత్ విస్తరణ వంటి అంశాలు కూడా స్థల ఎంపికలో కీలకం. ఈ ప్రమాణాలతో బిక్కనూర్‌లో పరిశీలించిన స్థలాలు అనుకూలం కాకపోతే.. మండలంలోని ఇతర ప్రాంతాలపై సమగ్రంగా సర్వే చేశారా? అన్నది స్పష్టం కావాలి.
బస్వాపూర్ నుంచి జంగంపల్లి వరకు.. బిక్కనూర్ మండల పరిధిలో అనువైన ప్రభుత్వ భూములు లేదా పెద్ద విస్తీర్ణంలో అందుబాటులో ఉన్న స్థలాలను అధికారులు పరిశీలించారా? రహదారి అనుసంధానం ఉన్న ప్రాంతాలను గుర్తించారా? భవిష్యత్‌లో భారీ విద్యా క్యాంపస్‌కు సరిపోయే భూమిని వెతికారా? అన్నదే స్థానికుల ప్రశ్న.
పోతులగుట్ట అనుకూలం కాదు.. ఆలయం వెనుక ప్రాంతం అనుకూలం కాదు అనుకుంటే.. అంతటితో బిక్కనూర్ మండలంలో స్థల అన్వేషణ ముగిసిపోవాల్సిన అవసరం ఏముంది? మండలంలో మరో స్థలం గుర్తించే ప్రయత్నం చేయకుండా క్యాసంపల్లిని ఎంపిక చేయడానికి కారణమేంటి? అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
బిక్కనూర్‌కు రైల్వే స్టేషన్, బస్సు రవాణా, రోడ్డు సౌకర్యం, జాతీయ రహదారితో అనుసంధానం ఉన్నాయి. ఎంపిక చేసిన స్థలానికి రహదారి లేదా ఇతర మౌలిక వసతులు అవసరమైతే వాటిని అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత. ప్రాజెక్టు కోసం మౌలిక వసతులు కల్పించాలా.. లేక మౌలిక వసతులు ఉన్న ప్రాంతానికే ప్రాజెక్టును తరలించాలా? అన్నది నిర్ణయాధికారుల ముందున్న అంశం.
రూ.200 కోట్ల స్థాయి రెసిడెన్షియల్ స్కూల్ అంటే కేవలం భవనం కాదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రుల రాకపోకలతో పాటు రవాణా, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, స్టేషనరీ, అద్దె ఇళ్లు, ఇతర సేవా రంగాలకు కూడా అవకాశం ఏర్పడుతుంది. దీంతో బిక్కనూర్ మండలానికి విద్యతో పాటు ఆర్థికంగా కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
అందుకే క్యాసంపల్లి ఎంపికకు ముందు బిక్కనూర్ మండలంలోని అన్ని ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించారా? అనే ప్రశ్నకు సమాధానం అవసరం. పరిశీలించి ఉంటే ఏ ప్రాంతాలను పరిశీలించారు? ఎందుకు తిరస్కరించారు? బిక్కనూర్ మండలంలో అనువైన స్థలం లేదని ఏ సాంకేతిక నివేదిక ఆధారంగా నిర్ణయించారు? అనే వివరాలను ప్రభుత్వం వెల్లడించాలి.
క్యాసంపల్లిలో పాఠశాల ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించడం ఈ అంశం ఉద్దేశం కాదు. బిక్కనూర్‌కు మంజూరైన ప్రాజెక్టును మండలం వెలుపలకు తరలించే ముందు.. బిక్కనూర్ మండలంలోనే మరో అనువైన స్థలాన్ని గుర్తించే ప్రయత్నం పూర్తిగా జరిగిందా లేదా? అన్నదే ప్రశ్న.
పోతులగుట్ట చూశారు.. సిద్ధరామేశ్వర స్వామి ఆలయం వెనుక చూశారు.. మరి బస్వాపూర్ నుంచి జంగంపల్లి వరకు మండలంలో ఇంకెక్కడా స్థలం లేదా? రూ.200 కోట్ల స్థాయి విద్యా ప్రాజెక్టు తరలింపుపై ప్రభుత్వం ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.






