ఆగస్టు 28న ‘వన్స్ మోర్’.. అర్జున్ దాస్ లవబుల్ లుక్
ప్రేమలో విఫలమైన ఓ యువకుడు జీవితాన్ని మార్చుకోవడం, అతని జీవితంలోకి ఓ ఉత్సాహభరితమైన యువతి రావడం చుట్టూ సాగే రొమాంటిక్ డ్రామా ‘వన్స్ మోర్’. విఘ్నేష్ శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జున్ దాస్ సరసన అదితి శంకర్ కథానాయికగా నటించింది. గత చిత్రాలకు భిన్నంగా అర్జున్ దాస్ ఈ సినిమాలో సాఫ్ట్ అండ్ లవబుల్ పాత్రలో కనిపించనున్నాడు. అతడి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చి అల్లరి చేసే యువతిగా అదితి శంకర్ పాత్ర ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. గతంలో ఎదురైన ప్రేమ గాయాల నుంచి కోలుకోవడం, గత జ్ఞాపకాలను అధిగమించడం, జీవితంలో లభించే రెండో అవకాశం వంటి భావోద్వేగ అంశాల చుట్టూ కథ సాగనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ‘హృదయం’, ‘ఖుషి’ వంటి చిత్రాలకు మ్యూజికల్ హిట్స్ అందించిన హెషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. మిలియన్ డాలర్ స్టూడియోస్ బ్యానర్‌పై యువరాజ్ గణేషన్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 28న థియేటర్లలో విడుదల కానుంది.





