ఉజ్జయిని మహంకాళి సన్నిధిలో సీఎం రేవంత్

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మాతకు సంప్రదాయబద్ధంగా బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.
లష్కర్ బోనాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ భారీగా కొనసాగింది. భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు, సంప్రదాయ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించగా, వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఐకమత్యంతో పండుగను జరుపుకోవాలని, బోనాల ఉత్సవాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.





