Friday, September 18, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జాతీయం

ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై జేపీసీ కసరత్తు షురూ!

తొలిసారి సమావేశమైన 31 మంది సభ్యుల కమిటీ..హోంశాఖ అధికారుల నుంచి బిల్లుపై వివరాలు-మైనారిటీ సంస్థలపై ప్రభావంపై ప్రతిపక్షాల అభ్యంతరాలు
SAI MANIKANTA
September 18, 2026 · 47 minutes క్రితం
3 Views 1 Shares
­న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 (నవజ్యోతి ప్రతినిధి):

విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు), ఇతర సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయడానికి ప్రతిపాదించిన విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు-2026 (ఎఫ్‌సీఆర్‌ఏ)పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) శుక్రవారం తొలిసారి సమావేశమైంది. బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన ఏర్పాటైన 31 మంది సభ్యుల కమిటీ బిల్లులోని ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించనుంది.

తొలి సమావేశంలో కేంద్ర హోంశాఖ ప్రతినిధులు కమిటీ సభ్యులకు బిల్లులోని నిబంధనలు, ప్రతిపాదిత మార్పులపై వివరాలు అందించారు. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులతో జేపీసీ ఏర్పాటైంది. కమిటీ తన నివేదికను 2026 శీతాకాల సమావేశాల తొలి వారంలో చివరి రోజులోపు లోక్‌సభకు సమర్పించాల్సి ఉంది.

ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం మార్చి 25న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అనంతరం ఆగస్టు 12న ఇరు సభల ఆమోదంతో జేపీసీకి పంపించారు. బిల్లులో ముఖ్యంగా ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ రద్దు, సంస్థ స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్‌ వదులుకోవడం లేదా గడువు ముగిసిన సందర్భాల్లో ఆ సంస్థకు చెందిన విదేశీ విరాళాలు, వాటితో ఏర్పడిన ఆస్తుల నిర్వహణ-పర్యవేక్షణ-పారవేయడానికి ప్రత్యేక అధికార వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది.

ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన గరిష్ఠ జైలు శిక్షను ఐదేళ్ల నుంచి ఏడాదికి తగ్గించే ప్రతిపాదన కూడా బిల్లులో ఉంది. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడం బిల్లు ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.

అయితే బిల్లులోని కొన్ని ప్రతిపాదనలపై ప్రతిపక్షాలు, పౌరసంఘాలు, కొన్ని మతపరమైన సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మైనారిటీ సంస్థలు, క్రైస్తవ సంస్థలకు విదేశీ నిధుల ప్రవాహంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కాంగ్రెస్‌ నేత కె.సి. వేణుగోపాల్‌ సహా పలువురు ప్రతిపక్ష నేతలు బిల్లును ప్రస్తుత రూపంలో ఆమోదించకూడదని పేర్కొన్నారు.

మరోవైపు ప్రభుత్వం ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది. బిల్లులో ఏ నిబంధనైనా మతం ఆధారంగా వివక్ష చూపుతుందని నిరూపించాలని ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరింది. విదేశీ విరాళాల నియంత్రణ, పారదర్శకత, నిధుల దుర్వినియోగం నివారణే లక్ష్యమని కేంద్రం స్పష్టం చేస్తోంది.

ఈ బిల్లును జేపీసీకి పంపాలని గతంలో మిజోరం ముఖ్యమంత్రి లాల్‌దుహోమా, నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నీఫియు రియో, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ కె. సంగ్మా సహా పలువురు ఆందోళనలు వ్యక్తం చేశారు. పలు క్రైస్తవ సంస్థలు కూడా కేంద్రాన్ని కలిసి తమ అభ్యంతరాలను వెల్లడించాయి. అమెరికాకు చెందిన కొందరు చట్టసభ సభ్యులు కూడా ప్రతిపాదిత మార్పులపై ఆందోళన వ్యక్తం చేయగా, భారత్‌ దీనిని దేశ అంతర్గత శాసన ప్రక్రియగా పేర్కొంది.

జేపీసీ పరిశీలన నేపథ్యంలో బిల్లులోని ప్రతి నిబంధనపై సభ్యుల అభిప్రాయాలు, సంబంధిత వర్గాల వాదనలు, నిధుల వినియోగం-పర్యవేక్షణకు సంబంధించిన అంశాలను కమిటీ పరిశీలించే అవకాశం ఉంది. కమిటీ నివేదిక సమర్పించిన తర్వాతే బిల్లుపై తదుపరి పార్లమెంటరీ ప్రక్రియ ముందుకు సాగనుంది.