Friday, September 18, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జాతీయం

తమిళనాడు : నవజాత శిశువులకు బంగారు ఉంగరం!

సెప్టెంబర్‌ 28న పథకం ప్రారంభం తొలి విడతలో 1.28 లక్షల ఉంగరాలు సిద్ధం...ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన శిశువులకు ఒక్క గ్రాము బంగారం
SAI MANIKANTA
September 18, 2026 · 22 seconds క్రితం
1 Views 1 Shares
చెన్నై, సెప్టెంబర్‌ 18 (నవజ్యోతి ప్రతినిధి):

తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తాయిమామన్‌ తంగ మోతిరం’ పథకాన్ని సెప్టెంబర్‌ 28న ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు ఒక్క గ్రాము, 22 క్యారెట్ల బంగారు ఉంగరాన్ని అందించే ఈ పథకం కోసం తొలి విడతలో 1,28,499 ఉంగరాలు సిద్ధం చేశారు.

ఈ పథకం సీఎం విజయ్‌ పుట్టినరోజైన జూన్‌ 22, 2026 నుంచి అమలులోకి వచ్చినట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఆ తేదీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులు తొలి దశలో ఈ పథకానికి అర్హులు. తమిళనాడు శాశ్వత నివాసితులైన కుటుంబాలకు చెందిన శిశువులకు మాత్రమే ఈ ప్రయోజనం వర్తిస్తుంది.

పథకం కింద మొత్తం 4,41,667 ఒక్క గ్రాము బంగారు ఉంగరాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏటా రూ.755.83 కోట్ల బడ్జెట్‌ కేటాయించింది. ఉంగరాలు 22 క్యారెట్ల బంగారంతో, బీఐఎస్‌ హాల్‌మార్క్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా కొనుగోలు ప్రక్రియ చేపట్టింది.

ఉంగరాల సరఫరా బాధ్యతను జోయాలుక్కాస్‌-కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ సంస్థలకు 70:30 నిష్పత్తిలో అప్పగించారు. తొలి దశలో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు అవసరమైన 1,28,499 ఉంగరాల కోసం ఆర్డర్లు జారీ చేశారు. ప్రతి ఉంగరానికి ప్రత్యేక సీరియల్‌ నంబర్‌, ట్యాంపర్‌ ప్రూఫ్‌ ప్యాకేజింగ్‌ ఉండేలా ఏర్పాట్లు చేశారు.

తొలుత సెప్టెంబర్‌ 15న మాజీ ముఖ్యమంత్రి సి.ఎన్‌. అన్నాదురై జయంతి సందర్భంగా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సీఎం విజయ్‌ విదేశీ పర్యటన నేపథ్యంలో ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. తాజా ప్రకారం సెప్టెంబర్‌ 28న ప్రారంభం కానుంది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, ప్రజల్లో ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకాన్ని పెంచడం, తల్లి-శిశువును గౌరవించే కార్యక్రమంగా ఈ పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. పథకం అమలుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశిత కేంద్రాల ద్వారా ఉంగరాలను ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు.

ఈ పథకం ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీల్లో ఒకటిగా ఉంది. పథకానికి సంబంధించిన ఉంగరాల కొనుగోలు టెండర్‌పై దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు ఇటీవల కొట్టివేసినట్లు కూడా తాజా నివేదికలు పేర్కొన్నాయి.