అమెరికా వీసాకు సోషల్ మీడియా చెక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన !
I, TN, TD వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియాపై పరిశీలన
అమెరికా వీసా దరఖాస్తుల పరిశీలనలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. అక్టోబర్ 1, 2026 నుంచి I, TN, TD నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను కూడా పరిశీలించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ కేటగిరీలకు చెందిన దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్న్నింటినీ ‘పబ్లిక్’ లేదా ‘ఓపెన్’గా ఉంచాలని ఆదేశించింది.
I వీసా ప్రధానంగా అమెరికాలో తాత్కాలికంగా పనిచేసేందుకు వెళ్లే విదేశీ మీడియా ప్రతినిధులకు వర్తిస్తుంది. జర్నలిస్టులు, రేడియో, సినిమా, ప్రింట్ మీడియా రంగాల్లో పనిచేసేవారు ఈ కేటగిరీలోకి వస్తారు. వార్తల సేకరణ – రిపోర్టింగ్, సమాచార లేదా విద్యా సంబంధిత కార్యకలాపాల కోసం అమెరికాకు వెళ్లే వారికి ఈ వీసా ఉపయోగపడుతుంది.
TN వీసా అమెరికా – మెక్సికో – కెనడా ఒప్పందం (USMCA) కింద అర్హత కలిగిన కెనడా, మెక్సికో పౌరులకు నిర్దిష్ట వృత్తుల్లో తాత్కాలికంగా పనిచేసేందుకు అవకాశం కల్పిస్తుంది. దరఖాస్తుదారుడికి ముందుగా ఉద్యోగ అవకాశం ఉండాలి. సంబంధిత వృత్తికి అవసరమైన అర్హతలను కూడా కలిగి ఉండాలి.
TD వీసా TN వీసాదారుడితో అమెరికాకు వచ్చే లేదా అక్కడ చేరే జీవిత భాగస్వామి, అవివాహిత మైనర్ పిల్లలకు వర్తిస్తుంది. TN వీసాకు ఉన్న పౌరసత్వ పరిమితులు TD డిపెండెంట్లకు అదే విధంగా వర్తించవు.
అక్టోబర్ 1 నుంచి ఈ మూడు కేటగిరీల దరఖాస్తుదారుల ఆన్లైన్ ఉనికిని పరిశీలించనున్నారు. వీసా స్క్రీనింగ్‌లో అందుబాటులో ఉన్న వివిధ సమాచార వనరులను ఉపయోగించి దరఖాస్తుదారుడు అమెరికాలోకి ప్రవేశించేందుకు అర్హుడా కాదా అన్నది అధికారులు పరిశీలిస్తారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
ఇప్పటికే F-1, M-1 విద్యార్థి వీసాలు, F-2, M-2 డిపెండెంట్ వీసాలు, H-1B, H-3, H-4, J-1, J-2 తదితర వీసా కేటగిరీల దరఖాస్తుదారులపై ఇలాంటి ఆన్లైన్ ప్రెజెన్స్ పరిశీలన అమల్లో ఉంది. A-3, G-5, C-3, K-1, K-2, K-3, Q, R-1, R-2తో పాటు S, T, U కేటగిరీలు కూడా ఈ పరిశీలన పరిధిలో ఉన్నాయి.
వీసా దరఖాస్తుల పరిశీలనలో జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. దరఖాస్తుదారులు తాము కోరుతున్న వీసాకు అర్హులని నిరూపించడంతో పాటు, అమెరికాలో ప్రవేశించిన తర్వాత వీసా నిబంధనలను పాటించే ఉద్దేశం ఉందని చూపించాల్సి ఉంటుందని తెలిపింది.
అమెరికా ప్రభుత్వ ప్రకారం వీసా మంజూరు అనేది ప్రభుత్వ విచక్షణాధికారానికి లోబడి ఉంటుంది. కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత I, TN, TD వీసాలకు దరఖాస్తు చేసే విదేశీ మీడియా ప్రతినిధులు, USMCA నిపుణులు – వారి డిపెండెంట్లు తమ సోషల్ మీడియా ప్రైవసీ సెట్టింగులను ముందుగానే పరిశీలించుకోవాల్సి ఉంటుంది.






