Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
తెలంగాణ

నాలుగేళ్ల చిన్నారిని అమెరికాకు తిరిగి పంపించాలి

అమెరికాలో నివసిస్తున్న నాలుగేళ్ల చిన్నారి యశికా నందన అమోజు
SAI MANIKANTA
September 21, 2026 · 4 hours క్రితం
7 Views 1 Shares

కస్టడీ వివాదంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

ఒరెగాన్‌ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చిన్నారిని అమెరికాకు పంపాలని ఆదేశం
తల్లితో కలిసి వెళ్లేందుకు విమాన ఖర్చులు భరించాలని తండ్రికి సూచన
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 (నవజ్యోతి ప్రతినిధి):

అంతర్జాతీయ కస్టడీ వివాదంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో నివసిస్తున్న నాలుగేళ్ల చిన్నారి యశికా నందన అమోజును అమెరికాకు తిరిగి పంపించాలని ఆదేశించింది. ఒరెగాన్‌ రాష్ట్రంలోని వాషింగ్టన్‌ కౌంటీ సర్క్యూట్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చిన్నారిని అమెరికాకు తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

చిన్నారి తండ్రి కాశ్యప్‌ అమోజు దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య, జస్టిస్‌ రేణుక యారా నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపింది. తల్లిదండ్రుల మధ్య చిన్నారి కస్టడీ వివాదం ఇప్పటికే అమెరికాలోని ఒరెగాన్‌ కోర్టులో విచారణలో ఉన్న విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.

కాశ్యప్‌ – ఆయన భార్య 2018 ఆగస్టులో భారత్‌లో వివాహం చేసుకున్నారు. 2022 సెప్టెంబర్‌లో అమెరికాలో వారి కుమార్తె జన్మించింది. చిన్నారి అమెరికా పౌరురాలు. 2025 ఫిబ్రవరిలో చిన్నారి కస్టడీపై ఒరెగాన్‌ కోర్టులో న్యాయపరమైన వివాదం ప్రారంభమైంది.

విచారణ సందర్భంగా చిన్నారి సాధారణ నివాసాన్ని మార్చకుండా, రాష్ట్రం వెలుపలకు తీసుకెళ్లకుండా తల్లిదండ్రులిద్దరినీ ఒరెగాన్‌ కోర్టు ఆదేశించింది. 2025 ఏప్రిల్‌ 10న తల్లిదండ్రులు తాత్కాలిక పేరెంటింగ్‌ షెడ్యూల్‌కు అంగీకరించారు. అయితే మూడు రోజుల తర్వాత తల్లి కోర్టు అనుమతి లేకుండా చిన్నారిని తీసుకుని భారత్‌కు వచ్చినట్లు కోర్టు రికార్డుల ఆధారంగా హైకోర్టు పేర్కొంది.

అనంతరం ఒరెగాన్‌ కోర్టు చిన్నారి తాత్కాలిక ఏకైక కస్టడీని తండ్రికి అప్పగిస్తూ, చిన్నారిని అమెరికాకు తిరిగి తీసుకెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విదేశీ కోర్టు ఇప్పటికే విచారిస్తున్న కస్టడీ వ్యవహారంలో ఆ కోర్టు ఆదేశాలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు ‘కోర్టుల పరస్పర గౌరవం’ (comity of courts) సూత్రాన్ని ప్రస్తావించింది.

తల్లి ఏకపక్షంగా చిన్నారిని అమెరికా నుంచి భారత్‌కు తీసుకురావడం అంగీకరించిన పేరెంటింగ్‌ ఏర్పాటుకు, ఒరెగాన్‌ కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందని బెంచ్‌ పేర్కొంది. అదే సమయంలో చిన్నారి సంక్షేమమే అత్యంత ముఖ్యమైన అంశం అని హైకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులిద్దరి ప్రేమ – ఆదరణ చిన్నారి శ్రేయస్సులో భాగమని, తండ్రికి కూడా తల్లిదండ్రిగా తన కుమార్తెతో సంబంధాన్ని కొనసాగించే అవకాశం ఉండాలని పేర్కొంది.

హైకోర్టు ఆదేశాల ప్రకారం తల్లి చిన్నారిని అమెరికాకు తీసుకెళ్లి ఒరెగాన్‌ కోర్టు ఆదేశాలను పాటించాలి. హైదరాబాద్‌ నుంచి ఒరెగాన్‌కు తల్లి – చిన్నారి ప్రయాణ ఖర్చులను తండ్రి భరించాలి. అమెరికాలో తల్లికి తగిన వసతి కల్పించడంతో పాటు, ఆమె భారత్‌కు తిరిగి రావాలనుకుంటే తిరుగు ప్రయాణ ఖర్చులను కూడా తండ్రే భరించాల్సి ఉంటుంది.

అయితే తల్లి అమెరికాకు వెళ్లేందుకు నిరాకరిస్తే హైదరాబాద్‌లోనే చిన్నారి భౌతిక కస్టడీని తండ్రికి లేదా ఆయన నియమించే కుటుంబ సభ్యుడికి అప్పగించాల్సి ఉంటుంది. చిన్నారితో తల్లి ప్రతిరోజూ వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుకునే అవకాశం మాత్రం కొనసాగుతుంది.

హైకోర్టు ప్రధానంగా చిన్నారి సంక్షేమం, తల్లిదండ్రులిద్దరి సంబంధం – ఇప్పటికే కస్టడీ అంశాన్ని విచారిస్తున్న ఒరెగాన్‌ కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఆదేశాలు జారీ చేసింది.