Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జాతీయం

ఐటీఐల ఆధునీకరణకు రూ.320 కోట్లతో కొత్త ఊపు

హర్యానాలో ఏడు శిక్షణ సంస్థల రూపాంతరం.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ
LAXMAN
September 21, 2026 · 5 hours క్రితం
2 Views 0 Shares

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21 (నవజ్యోతి):

యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఐటీఐల ఆధునీకరణపై దృష్టి సారించింది. ప్రధానమంత్రి నైపుణ్య శిక్షణ, విద్యా రూపాంతర కార్యక్రమం పీఎం-సేతు కింద హర్యానాలోని కురుక్షేత్ర ఐటీఐ సమూహ అభివృద్ధికి రూ.320 కోట్ల పెట్టుబడికి జాతీయ మార్గనిర్దేశక కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో సమూహ పరిధిలోని ఏడు పారిశ్రామిక శిక్షణ సంస్థలను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దనున్నారు.

ఈ కార్యక్రమంలో జిందాల్ నవీన్ అవసర్ లిమిటెడ్ భాగస్వామ్య సంస్థగా వ్యవహరించనుంది. పరిశ్రమల్లో మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, శిక్షణ విధానాలను రూపొందించడంతో పాటు విద్యార్థులకు ప్రాయోగిక అనుభవం కల్పించేందుకు ఆధునిక పరికరాలు, మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. శిక్షణ సంస్థలు, పరిశ్రమల మధ్య ప్రత్యక్ష అనుసంధానాన్ని పెంచడం ద్వారా కోర్సులు పూర్తిచేసిన యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

పీఎం-సేతు కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పది ఐటీఐ సమూహాలకు రూ.2,491 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు సరిపడే నైపుణ్యవంతమైన మానవ వనరులను తయారు చేయడంపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారిస్తోంది.

కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ పరిశ్రమలను ఐటీఐలకు మరింత చేరువ చేయడం ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కురుక్షేత్ర ఐటీఐ సమూహ ఆధునీకరణతో హర్యానాలో నైపుణ్య శిక్షణకు మరింత ఊతం లభించనుంది.