రేపు సంగారెడ్డిలో రక్తదాన మహాయజ్ఞం
సంగారెడ్డి, సెప్టెంబర్ 21 (నవజ్యోతి ప్రతినిధి):
జన్మదిన వేడుకకు సేవా స్ఫూర్తిని జోడిస్తూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో రేపు రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. సంగారెడ్డి ప్రభుత్వ ఐబీ ప్రాంగణంలో సెప్టెంబర్ 22న ఉదయం 10.30 గంటలకు శిబిరం ప్రారంభం కానుంది.
కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. ఫైసల్‌తో పాటు యూనియన్ జిల్లా ముఖ్య నాయకులు, జర్నలిస్టులు హాజరుకానున్నారు. బండారు యాదగిరి జన్మదినాన్ని ఆర్భాటాలకు దూరంగా సామాజిక సేవకు అంకితం చేస్తూ రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో అందుబాటులో ఉండేలా స్వచ్ఛంద రక్తదాతల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సేవా కార్యక్రమంలో జర్నలిస్టులతో పాటు యువత, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఆరోగ్యవంతులైన పౌరులు భాగస్వాములు కావాలని కోరారు.
రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణాధారంగా నిలవవచ్చని పేర్కొన్నారు. రక్తదానం చేసేందుకు ఆసక్తి ఉన్నవారు రేపు ఉదయం 10.30 గంటలకు సంగారెడ్డి ప్రభుత్వ ఐబీకి చేరుకుని శిబిరాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.






