Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మెదక్

“ప్రజా ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరు”.. హెచ్చరికలతో లేఖ విడుదల!

తూప్రాన్‌ మున్సిపల్‌ గేటుకు ఎర్ర జెండాతో బ్యానర్‌..APTH - అలెగ్జాండర్‌ పేరుతో లేఖలు.. పోలీస్‌ స్టేషన్లలోనూ ప్రత్యక్షం...కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూ సర్వే నేపథ్యంలో గజ్వేల్‌ నియోజకవర్గంలో కలకలం
SAI MANIKANTA
September 21, 2026 · 11 hours క్రితం
369 Views 2 Shares

 తూప్రాన్‌, సెప్టెంబర్‌ 21 (నవజ్యోతి ప్రతినిధి):

“ప్రజా ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరు.. ఉరిశిక్షలతో ఉద్యమాన్ని అణచివేయాలనుకోవడం మూర్ఖత్వమే” అంటూ హెచ్చరికలు ఉన్నట్లు పేర్కొన్న ఓ లేఖ మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో కలకలం రేపింది. APTH – అలెగ్జాండర్‌ పేరుతో వెలువడినట్లు చెబుతున్న ఈ లేఖతో తూప్రాన్‌ మున్సిపల్‌ కార్యాలయం – పోలీస్‌ స్టేషన్‌ పరిసరాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది.

తూప్రాన్‌ మున్సిపల్‌ కార్యాలయ గేటుకు ఎర్ర జెండాతో కూడిన బ్యానర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అదే సమయంలో తూప్రాన్‌ పోలీస్‌ స్టేషన్‌ గేట్ల లోపల లేఖలను పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీస్‌ స్టేషన్ల వద్దకు లేఖలు ఎలా చేరాయి? వాటిని ఎవరు ఏర్పాటు చేశారు? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ముఖ్యమంత్రి మేడారం పర్యటనలో ఉన్న సమయంలో మొదటి లేఖ విడుదల చేశామని, ప్రస్తుతం రెండో లేఖను విడుదల చేస్తున్నామని అందులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటననా? లేక ముందస్తు ప్రణాళికతో లేఖలు – బ్యానర్లు ఏర్పాటు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ పరిసరాల్లో భూ సర్వే జరుగుతున్న నేపథ్యంలో గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్‌లో ఈ లేఖలు వెలుగుచూడటం మరింత ఆసక్తికరంగా మారింది. భూ సర్వేకు – లేఖల వ్యవహారానికి ఏమైనా సంబంధం ఉందా? లేక వేరే అంశంపై హెచ్చరికలు జారీ చేశారా? అనే చర్చ స్థానికంగా సాగుతోంది.

“10 మంది విప్లవ యోధులకు ఉరిశిక్ష విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం” అంటూ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. రాజ్య హింస – ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వారికి ఉరిశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఉరిశిక్ష న్యాయస్థానం చేసిన న్యాయం కాదని, విప్లవ ఉద్యమాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యగా లేఖలో ఆరోపించినట్లు సమాచారం. ప్రజల హక్కుల కోసం పోరాడితే చట్టాల పేరుతో చంపడం రాజ్యాంగ విరుద్ధమని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

“ఉరిశిక్ష ద్వారా ప్రజా విప్లవాన్ని ప్రభుత్వం ఆపగలదని భావిస్తే అది వారి మూర్ఖత్వమే” అంటూ లేఖలో హెచ్చరించినట్లు సమాచారం. ప్రజా ఉద్యమాన్ని అణచివేయడం సాధ్యం కాదని పేర్కొంటూ హెచ్చరికలతో కూడిన సందేశాన్ని విడుదల చేసినట్లు తెలుస్తోంది.

తూప్రాన్‌ మున్సిపల్‌ కార్యాలయంతో పాటు రెండు పోలీస్‌ స్టేషన్ల వద్ద ఒకే పేరుతో లేఖలు కనిపించడం అధికార వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ముఖ్యంగా పోలీస్‌ స్టేషన్‌ గేట్ల లోపల లేఖలు పడేసి వెళ్లడం పట్ల పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

లేఖలను ఎవరు ఏర్పాటు చేశారు? APTH – అలెగ్జాండర్‌ పేరును ఎందుకు ఉపయోగించారు? ఎర్ర జెండాతో బ్యానర్‌ను మున్సిపల్‌ కార్యాలయానికి ఎందుకు కట్టారు? లేఖలో పేర్కొన్న హెచ్చరికలకు ప్రస్తుత పరిణామాలతో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై అధికారులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. లేఖల వెనుక ఉన్న వ్యక్తులు, వాటి ఉద్దేశం, లేఖలో పేర్కొన్న అంశాల వాస్తవ పరిస్థితులపై దర్యాప్తు పూర్తయితేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు లేఖలోని వ్యాఖ్యలను వాటిని విడుదల చేసినట్లు పేర్కొన్న వ్యక్తుల అభిప్రాయాలుగానే చూడాల్సి ఉంటుంది.

పోలీస్‌ స్టేషన్ల గేట్ల వద్దకే లేఖలు.. మున్సిపల్‌ కార్యాలయానికి ఎర్ర జెండాతో బ్యానర్‌.. అసలు ఈ లేఖల వెనుక ఎవరున్నారు?