రాజకీయాలు వేరు.. ఆత్మీయ బంధాలు వేరు!
– 21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి, హరీష్ రావు ఆత్మీయ కలయిక.. నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రులు
సంగారెడ్డి : తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా కొనసాగుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు 21 ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. సంగారెడ్డి పట్టణంలోని రాంనగర్లో గల జగ్గారెడ్డి నివాసంలో శనివారం నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఆయన ఆహ్వానం మేరకు హరీష్ రావు హాజరయ్యారు. నూతన వధూవరులు భరత్ సాయి రెడ్డి, పాలక్ పటేల్‌లను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆప్యాయంగా పలకరించుకొని నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ 2004లో హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఛాంబర్లో ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్లమని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత హరీష్ రావును వ్యక్తిగతంగా కలవలేదన్నారు. ఆయన పదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కలవలేదని గుర్తుచేశారు. గతంలో తన కుమార్తె వివాహానికి హరీష్ రావును ఆహ్వానించలేకపోయానని, ఈసారి కుమారుడి వివాహానంతరం నిర్వహించిన వ్రతానికి తప్పకుండా రావాలని కోరినట్లు తెలిపారు. తన ఆహ్వానాన్ని మన్నించి హరీష్ రావు ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్లో అగ్రనేత అని, తాను రాష్ట్ర కాంగ్రెస్‌లో ఒక స్థాయి నాయకుడిగా కొనసాగుతున్నానని పేర్కొన్నారు. రాజకీయాలు, వ్యక్తిగత సంబంధాలు వేర్వేరని స్పష్టం చేశారు. తమ కలయిక వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఇరువురు నేతలు వెల్లడించారు. మరోవైపు సత్యనారాయణ స్వామి వ్రతానికి రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం జగ్గారెడ్డి నివాసంలో భోజనం చేశారు. అధికార కాంగ్రెస్ మంత్రులతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఒకే కుటుంబ వేడుకకు హాజరుకావడం విశేషంగా నిలిచింది.






