ధన్వాడలో ఆధ్యాత్మిక వైభవం.. భక్తి పారవశ్యంలో పల్లె!
నవంబర్ 1
ఆధ్యాత్మిక కార్యక్రమం
కాటారం, నవంబర్ 1 (నవజ్యోతి ప్రతినిధి):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఆదివారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మైసూర్ అవధూత దత్త పీఠాధిపతి పరమ పూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రత్యేక హెలికాప్టర్‌లో గ్రామానికి విచ్చేయడంతో ధన్వాడ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. ముందుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వగృహానికి చేరుకున్న స్వామీజీకి మంత్రి తన సతీమణి, కుటుంబ సభ్యులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా పాదపూజ నిర్వహించి ఆశీర్వచనాలు పొందారు. మంత్రి కుటుంబ సభ్యులతో పాటు మంథని నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని స్వామీజీ ఆశీర్వదించారు.
అనంతరం ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయానికి విచ్చేసిన గణపతి సచ్చిదానంద స్వామీజీకి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. మహిళా భక్తులు మంగళహారతులతో స్వామీజీకి స్వాగతం పలకడంతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించడంతో పాటు వేద పండితుల ఆధ్వర్యంలో హోమాది క్రతువులు, మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు. లోకకల్యాణం, దేశ సుభిక్షం, రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో వర్ధిల్లాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధర్మసభలో స్వామీజీ భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. సనాతన ధర్మం అనేది ఎవరో ఒకరు సృష్టించినది కాదని, అనాదిగా వస్తున్న శాశ్వత జీవన విధానమని వివరించారు. ధర్మాన్ని ఆచరించడం ద్వారానే మనిషికి నిజమైన మనశ్శాంతి, సంతోషం లభిస్తాయని పేర్కొన్నారు. ఆధునిక కాలంలో యువత తమ సంస్కృతి, సంప్రదాయాలకు దూరం కాకూడదని సూచించారు. తల్లిదండ్రులు చిన్నతనం నుంచే పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలు, భక్తిభావాన్ని అలవాటు చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలను దేవాలయాలకు తీసుకెళ్లి ధర్మం, భక్తి గొప్పతనాన్ని తెలియజేయాలని సూచించారు. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేస్తూ, ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుందని సందేశమిచ్చారు.
స్వామీజీ రాకతో సంతోషం: మంత్రి శ్రీధర్ బాబు
ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ గణపతి సచ్చిదానంద స్వామీజీ ధన్వాడ గ్రామానికి విచ్చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. స్వామీజీ రాకతో గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని, ఆయన ఆశీస్సులు మంథని నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సనాతన ధర్మ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు దంపతులతో పాటు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, వారి సతీమణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, వారి సతీమణి, మంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పలువురు రాజకీయ నాయకులు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు సైతం స్వామీజీని దర్శించుకుని ఆశీర్వచనాలు పొందారు.
ఏడు మండలాలు, మూడు జిల్లాల నుంచి భక్తుల రాక
స్వామీజీ రాక విషయం తెలుసుకున్న కాటారం, మంథని, మహాముత్తారం, మల్హర్‌రావు, ముత్తారం మండలాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు ధన్వాడకు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రత్యేక పూజలు, హోమాలు, మహాపూర్ణాహుతి, స్వామీజీ ఆధ్యాత్మిక ప్రవచనాలతో ధన్వాడ గ్రామం ఆద్యంతం భక్తిమయంగా మారింది. స్వామీజీ ఆశీర్వచనాలు పొందిన భక్తులు ఆనందోత్సాహాలతో తిరిగి వెళ్లగా, ఆదివారం ధన్వాడలో జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుక గ్రామస్థులకు, భక్తులకు మరపురాని అనుభూతిని మిగిల్చింది.






