బాన్సువాడ/కామారెడ్డి, నవంబర్ 1 (నవజ్యోతి ప్రతినిధి):

బాన్సువాడ పట్టణంలోని ఎర్రమన్ను కుచ్చ ప్రాంతంలో నాటు బాంబుల పేలుడు తీవ్ర కలకలం రేపింది. పందుల వేట కోసం మోపెడ్‌పై తరలిస్తున్న బాంబులు ఒక్కసారిగా పేలడంతో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో వైశాలి (7), శ్రీదేవి (5), అంజలి (6) అనే చిన్నారులతో పాటు రాజు, లక్ష్మణ్, వెంకయ్య, రమేష్ ఉన్నారు. వీరిలో శ్రీదేవి, అంజలి, రమేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన క్షతగాత్రులకు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు.
ఒక్క బాంబు పేలుడు.. వరుసగా పేలిన మరికొన్ని!
ఇంటి వద్ద బాంబును నేలకేసి కొట్టే ప్రయత్నంలో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమీపంలో ఉన్న ఇతర బాంబులు కూడా పేలడంతో అక్కడున్నవారు గాయపడ్డారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం దాసరి లక్ష్మయ్య మోపెడ్‌పై పందుల వేటకు నాటు బాంబులను తీసుకెళ్తుండగా, ఇంటి వద్ద ఒక బాంబును నేలకేసి కొట్టే ప్రయత్నం చేయడంతో అది ఒక్కసారిగా పేలింది. దాని ప్రభావానికి సమీపంలో ఉన్న ఇతర బాంబులు సైతం వరుసగా పేలడంతో అక్కడున్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని నిజామాబాద్‌కు పంపించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
సమాచారం అందుకున్న బాన్సువాడ సీఐ శ్రీధర్ పోలీసు సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ ప్రాంతంలో అడవి పందుల వేట కోసం రైతులు నాటు బాంబులను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరికి సరఫరా చేస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
జెలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల నిల్వపైనా అనుమానాలు
పట్టణ శివారులోని గుట్టల్లో రాళ్లను పేల్చేందుకు ఉపయోగించే జెలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల నిల్వ, వినియోగంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టోన్ క్రషర్ల నిర్వాహకులు అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను నిల్వ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వాటి సరఫరా మార్గాలపై పోలీసులు దృష్టి సారించారు.
నాటు బాంబులు, పేలుడు పదార్థాలు ఇంత బహిరంగంగా అందుబాటులోకి ఎలా వస్తున్నాయనే ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అడవి పందుల వేట పేరుతో ప్రమాదకరమైన బాంబులను వినియోగించడం వల్ల అమాయక ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. పేలుడు పదార్థాల అక్రమ తయారీ, నిల్వ, రవాణా, సరఫరాపై ముందస్తు నిఘా ఎందుకు పెట్టలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అక్రమ బాంబుల తయారీ, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ పేలుడు పదార్థాలపై నిఘా అవసరం
నాటు బాంబుల తయారీ, సరఫరా, వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రజల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.