జిల్లా ఆసుపత్రిలో కేంద్ర ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కేంద్ర ఆక్సిజన్ ప్లాంట్‌ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న కొద్ది నెలల్లో జిల్లా ఆసుపత్రిని అన్ని రకాల వైద్య సదుపాయాలతో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం రూ.24 కోట్ల నిధులు మంజూరు చేసిందని, ఇందులో రూ.12 కోట్లు భవన నిర్మాణ పనులకు కేటాయించినట్లు వెల్లడించారు. మరో 15 రోజుల్లో కాంట్రాక్టర్ నిర్మాణ పనులను పూర్తి చేసి అప్పగించనున్నట్లు తెలిపారు. పేదలకు అన్ని రకాల వైద్య చికిత్సలు అందించేందుకు రూ.7.50 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని, అనుభవజ్ఞులైన వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ ఆసుపత్రి పరిసరాలను, అభివృద్ధి పనులను పరిశీలించి త్వరలోనే మెరుగైన వైద్య సదుపాయాలతో జిల్లా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.






