Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
అంతర్జాతీయ

ఉత్తరకొరియా – అణు పరీక్షలతో.. వణుకుతున్న పర్వతం!

మాంటాప్‌ పర్వతంలో పెరిగిన భూకంపాలు 2017 అణు పరీక్ష తర్వాత దాదాపు 1,400 ప్రకంపనలు భవిష్యత్‌ భూకంపాలపై శాస్త్రవేత్తల ఆందోళన
SAI MANIKANTA
September 19, 2026 · 3 days క్రితం
9 Views 1 Shares
PUNGGYE-RI NUCLEAR TEST SITE, NORTH KOREA - APRIL 20, 2018. DigitalGlobe via Getty Images overview imagery of Punggye-ri, the North Korea nuclear test site. (Photo DigitalGlobe via Getty Images/38 North via Getty Images)

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 17 (నవజ్యోతి ప్రతినిధి):

ఉత్తర కొరియాలోని మాంటాప్‌ పర్వతం వరుస అణు పరీక్షల ప్రభావంతో భౌగోళికంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. మాంటాప్సాన్‌గా కూడా పిలిచే ఈ పర్వత ప్రాంతంలో 2017లో జరిగిన చివరి భూగర్భ అణు పరీక్ష తర్వాత భూకంప కార్యకలాపాలు గణనీయంగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

సైన్స్‌ జర్నల్‌లో సెప్టెంబర్‌ 17న ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 2008 నుంచి 2025 మధ్య మాంటాప్‌ పర్వత పరిసరాల్లో దాదాపు 1,400 భూకంపాలు నమోదయ్యాయి. 2017 సెప్టెంబర్‌ 3న జరిగిన అణు పరీక్ష తర్వాత వాటి తరచుదనం – తీవ్రత పెరిగినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

పుసాన్‌ నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన భూకంప శాస్త్రవేత్త – జియోఫిజిసిస్ట్‌ క్వాంగ్‌-హీ కిమ్‌ సహా పరిశోధకుల ప్రకారం.. వరుస భూగర్భ అణు పరీక్షలు పర్వతం చుట్టుపక్కల ఉన్న శిలలను క్రమంగా దెబ్బతీశాయి. ఇప్పటికే ఉన్న భౌగోళిక పగుళ్లపై ఒత్తిళ్లను కూడా మార్చాయి. 2017లో జరిగిన పరీక్ష ఈ ప్రాంతంలో అత్యధిక నష్టాన్ని కలిగించినట్లు అధ్యయనం పేర్కొంది.

2017 అణు పరీక్ష శక్తి 100 నుంచి 250 కిలోటన్నుల టీఎన్‌టీతో సమానంగా ఉన్నట్లు అంచనా. ఇది 1945లో హిరోషిమాపై పడిన అణుబాంబు పేలుడి శక్తికి సుమారు 20 రెట్లు వరకు ఉండొచ్చని అధ్యయనంలో పేర్కొన్నారు.

భూగర్భ అణు పరీక్షల తర్వాత కొంతకాలం స్థానికంగా భూకంపాలు రావడం సాధారణమే. అయితే 2017 పరీక్ష జరిగిన కొన్ని నిమిషాలకే మాంటాప్‌ పర్వతంపై నమోదైన అసాధారణ ప్రకంపన అప్పట్లోనే నిపుణుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా బయటపడిన దీర్ఘకాలిక భూకంప కార్యకలాపాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.

కొలంబియా యూనివర్సిటీకి చెందిన భూకంప శాస్త్రవేత్త పాల్‌ రిచర్డ్స్‌ ఈ అధ్యయనంలో పాల్గొనకపోయినా, గుర్తించిన పరిణామాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత పెద్ద భూకంపాలకు దారితీసే అవకాశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారీ భూగర్భ పేలుళ్ల కారణంగా పర్వతంలోని శిలలు విరిగిపోయి, రేడియోధార్మిక వాయువులను భూగర్భంలో నిరోధించే సామర్థ్యం తగ్గిన అణు పరీక్షా ప్రాంతాలను శాస్త్రవేత్తలు “టైర్డ్‌ మౌంటెన్‌”గా పేర్కొంటారు. 2017 పరీక్షతో మాంటాప్‌ పర్వత శిఖర ప్రాంతం కూడా కూలిపోయినట్లు అధ్యయనం తెలిపింది.

దీంతో మాంటాప్‌ శిఖరం కింద భవిష్యత్తులో అణు పరీక్షలు నిర్వహించే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, చుట్టుపక్కల ఉన్న పుంగ్యే-రి అణు పరీక్షా సముదాయంలోని ఇతర భూగర్భ ప్రాంతాల్లో పరీక్షలు జరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

మరో కీలక అంశం ఏమిటంటే.. అణు పేలుళ్లకు సంవత్సరాల తర్వాత కూడా భూకంపాలు కొనసాగితే వాటిని సహజ భూకంపాల నుంచి వేరు చేయడం అంతర్జాతీయ పర్యవేక్షణ సంస్థలకు మరింత క్లిష్టంగా మారవచ్చని పరిశోధకులు హెచ్చరించారు. అణు పేలుళ్లను గుర్తించడం – వాటి ప్రభావాన్ని అంచనా వేయడంలో ఇది సవాలుగా మారనుంది.

2008-2025 మధ్య దాదాపు 1,400 భూకంపాలు
2017 అణు పరీక్ష తర్వాత ప్రకంపనల తీవ్రత – తరచుదనం పెరుగుదల
భవిష్యత్‌ భూకంపాలు – అణు పరీక్షల పర్యవేక్షణపై కొత్త సవాళ్లు