Friday, September 18, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
క్రీడలు

హాంగ్‌జౌ తర్వాత.. నాగోయా ఏసియన్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో పరీక్ష !

పతకాల వేటకు సిద్ధమైన భారత క్రీడాకారులు..షూటింగ్‌ - అథ్లెటిక్స్‌ - క్రికెట్‌ - హాకీపై భారీ అంచనాలు-2036 లక్ష్యానికి నాగోయా ఏసియన్‌ గేమ్స్‌ మరో కీలక మలుపు !
SAI MANIKANTA
September 18, 2026 · 3 hours క్రితం
7 Views 1 Shares

నాగోయా, సెప్టెంబర్‌ 18 (నవజ్యోతి ప్రతినిధి):

నాగోయా ఏసియన్‌­ గేమ్స్‌లో భారత క్రీడా పటిమకు మరోసారి పరీక్ష ఎదురుకానుంది. జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా 20వ ఆసియా క్రీడలు సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జరగనున్నాయి. 45 దేశాల నుంచి దాదాపు 11 వేల మంది క్రీడాకారులు 43 క్రీడాంశాల్లో పోటీ పడనున్నారు. భారత బృందం గత హాంగ్‌జౌ ఏసియన్‌ గేమ్స్‌లో సాధించిన రికార్డు ప్రదర్శనను కొనసాగిస్తూ వివిధ క్రీడల్లో పతకాల కోసం బరిలోకి దిగనుంది.

2022 హాంగ్‌జౌ ఏసియన్‌ గేమ్స్‌లో భారత్‌ రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించింది. ఇందులో 28 స్వర్ణాలు, 39 రజతాలు – 41 కాంస్యాలు ఉన్నాయి. మొత్తం పతకాల పరంగా భారత్‌కు ఇదే అత్యుత్తమ ఆసియా క్రీడల ప్రదర్శన. ఈ విజయంతో పలు క్రీడాంశాల్లో భారత్‌ పోటీ సామర్థ్యం పెరిగిందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు నాగోయా ఏసియన్‌ గేమ్స్‌లో ఆ స్థాయిని కొనసాగించడమే భారత క్రీడాకారుల ముందున్న సవాల్‌గా మారింది.

భారత క్రీడా వ్యవస్థ 2036 నాటికి ప్రపంచంలోని టాప్‌-10 క్రీడా దేశాల్లో స్థానం సంపాదించడం – 2047 నాటికి టాప్‌-5లోకి చేరడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో నాగోయా ఏసియన్‌ గేమ్స్‌ భారత క్రీడల్లో పెరుగుతున్న ప్రతిభ – బెంచ్‌ బలం – వివిధ క్రీడాంశాల్లో పోటీ సామర్థ్యాన్ని అంచనా వేసే ముఖ్యమైన వేదికగా నిలవనుంది.

షూటింగ్‌లో భారత్‌ బలమైన బృందంతో బరిలోకి దిగుతోంది. ఒలింపిక్‌ పతక విజేత మను భాకర్‌తో పాటు యువ క్రీడాకారులు – అనుభవజ్ఞులు కలిసి రైఫిల్‌, పిస్టల్‌ – షాట్‌గన్‌ విభాగాల్లో పోటీ పడనున్నారు. మొత్తం 30 మంది షూటర్లు వివిధ విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆసియా స్థాయిలో చైనా వంటి బలమైన ప్రత్యర్థులు ఉండటంతో ప్రతి ఈవెంట్‌లో గట్టి పోటీ తప్పదు.

అథ్లెటిక్స్‌లోనూ భారత్‌ నుంచి విస్తృతమైన బృందం పతకాలపై ఆశలు రేపుతోంది. తజీందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌, మురళీ శ్రీశంకర్‌, గుల్వీర్‌ సింగ్‌, రోహిత్‌ యాదవ్‌, తేజస్విన్‌ శంకర్‌, అంజీ సోజన్‌, సర్వేశ్‌ కుషారే, జ్యోతి యర్రాజీ – ప్రవీణ్‌ చిత్రవేల్‌ తదితరులు తమ విభాగాల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా గాయం కారణంగా నాగోయా ఏసియన్‌ గేమ్స్‌కు దూరమయ్యారు. దీంతో వరుసగా మూడో ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించాలన్న ఆయనకు అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ అథ్లెటిక్స్‌లో ఇతర భారత క్రీడాకారులు పతకాల కోసం బలమైన పోటీ ఇవ్వాలని చూస్తున్నారు.

క్రికెట్‌లో పురుషుల – మహిళల జట్లపై భారీ అంచనాలు ఉన్నాయి. హాంగ్‌జౌ ఏసియన్‌ గేమ్స్‌లో స్వర్ణాలు సాధించిన భారత జట్లు నాగోయాలోనూ టైటిళ్లను నిలబెట్టుకునే లక్ష్యంతో బరిలోకి దిగనున్నాయి. 2028 లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ప్రవేశించనున్న నేపథ్యంలో ఆసియా క్రీడల్లో జరిగే పోటీలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, లక్ష్యసేన్‌ వంటి అనుభవజ్ఞులతో పాటు యువ క్రీడాకారులు భారత్‌ ఆశలను మోస్తున్నారు. సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి – చిరాగ్‌ శెట్టి జోడీ పురుషుల డబుల్స్‌లో మరోసారి బలమైన ప్రదర్శన ఇవ్వాలని చూస్తోంది. భారత పురుషుల డబుల్స్‌ విభాగంలో ఆసియా క్రీడల స్వర్ణం సాధించాలన్న లక్ష్యం కూడా కీలకంగా మారింది.

హాకీలో పురుషుల జట్టు గత ఆసియా క్రీడల చాంపియన్‌గా నాగోయా ఏసియన్‌ గేమ్స్‌లో బరిలోకి దిగుతోంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించడం ద్వారా లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందే అవకాశం ఉండటంతో హాకీ పోటీలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. మహిళల జట్టు హాంగ్‌జౌలో సాధించిన రజత పతకాన్ని మెరుగుపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కబడ్డీలో భారత పురుషుల జట్టు హాంగ్‌జౌలో స్వర్ణాన్ని తిరిగి సాధించిన తర్వాత మరోసారి టైటిల్‌ కోసం బరిలోకి దిగుతోంది. బాక్సింగ్‌, ఆర్చరీ, రెజ్లింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ వంటి విభాగాల్లోనూ భారత్‌ పతకాలపై ఆశలు పెట్టుకుంది. యువ క్రీడాకారులకు తమ ప్రతిభను అంతర్జాతీయ వేదికపై నిరూపించుకునే అవకాశం కూడా ఈ పోటీలు కల్పించనున్నాయి.

ఇదిలా ఉండగా, నాగోయా ఏసియన్‌ గేమ్స్‌ ప్రారంభానికి ముందే భారత క్రీడాకారులు వసతి – రవాణా సమస్యలను ఎదుర్కొన్నట్లు నివేదికలు వెలువడ్డాయి. కొంతమంది క్రీడాకారులు గదుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని, కొన్ని బృందాలకు ప్రయాణ సమయం ఎక్కువగా ఉండటంతో అసౌకర్యం ఏర్పడిందని సమాచారం. పోటీలు ప్రారంభమైన తర్వాత ఈ సమస్యలు పక్కకు వెళ్లి క్రీడాకారుల దృష్టి పూర్తిగా పోటీలపైనే ఉండనుంది.

హాంగ్‌జౌ ఏసియన్‌ గేమ్స్‌ భారత్‌కు కొత్త ప్రమాణాన్ని నిర్దేశించింది. నాగోయా ఏసియన్‌ గేమ్స్‌ ఆ ప్రమాణాన్ని ఎంతవరకు కొనసాగించగలమన్నది తేల్చే మరో కీలక వేదిక. పతకాల సంఖ్యతో పాటు వివిధ క్రీడాంశాల్లో భారత క్రీడాకారుల ప్రదర్శన – యువ ప్రతిభ ఎదుగుదల – అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే సామర్థ్యం కూడా ఈ క్రీడల్లో కీలకంగా మారనుంది.

సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జరిగే నాగోయా ఏసియన్‌ గేమ్స్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. హాంగ్‌జౌలో సాధించిన రికార్డు తర్వాత భారత్‌ ఎలాంటి ప్రదర్శన ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2036 క్రీడా లక్ష్యాల దిశగా భారత్‌ సాగుతున్న ప్రయాణంలో నాగోయా ఏసియన్‌ గేమ్స్‌ మరో ముఖ్యమైన అడుగుగా నిలవనుంది.