భూ సమస్యల పరిష్కారానికి సర్కార్ కీలక నిర్ణయాలు!
రాష్ట్రంలో నిషేధిత ఆస్తుల జాబితా 22-ఎ పరిధిలోని భూముల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వివిధ రకాల భూ వివాదాలు – నాలా రుసుములు – అనధికార లేఅవుట్లు – ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి కీలక విధాన నిర్ణయాలను ప్రకటించింది.
పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం (యూఎల్సీ) కింద ఉన్న మిగులు భూముల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం త్వరలో కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పాత దరఖాస్తులతో పాటు కొత్తగా వచ్చే దరఖాస్తులకూ ఈ విధానం వర్తించనుంది.
భూముల రిజిస్ట్రేషన్ – క్రమబద్ధీకరణ ప్రక్రియలను విడివిడిగా కాకుండా రెండు సమాంతరంగా – ఏకకాలంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది. దీంతో పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని పేర్కొంది.
హెచ్ఎండీఏ – జీహెచ్ఎంసీ – డీటీసీపీ పరిధిలోని అనధికార లేఅవుట్లు – ప్రభుత్వ భూముల ఆక్రమణలు వంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారుల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
సికింద్రాబాద్ పరిధిలోని లీజ్‌హోల్డ్ ఆస్తులను ఫ్రీహోల్డ్‌గా క్రమబద్ధీకరించే అంశంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక అధికారుల కమిటీల ద్వారా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది.
సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయి ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. స్థానికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించేలా కమిటీ పనిచేయనుంది.
పేద – బలహీన వర్గాల గృహ నిర్మాణ అవసరాల కోసం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విధానం ద్వారా సమకూరే నిధులను ఎస్సీ – ఎస్టీ – బీసీ – మైనార్టీ వర్గాలకు చెందిన నిరుపేద లబ్ధిదారుల గృహ నిర్మాణ అవసరాలకు కేటాయించనున్నట్లు పేర్కొంది.
22-ఎ భూములు – యూఎల్సీ మిగులు భూములు – అనధికార లేఅవుట్లు – ప్రభుత్వ భూములు – లీజ్‌హోల్డ్ ఆస్తులు – కోల్‌బెల్ట్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న భూ వ్యవహారాలను క్రమబద్ధీకరించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.






