గణేశ్ నిమజ్జనం వేళ ఉద్రిక్తత.. ముగ్గురు అదుపులోకి!
మదన్నపేట 2బీహెచ్‌కే పోలీస్ హౌసింగ్ సొసైటీలో ఘటన
గణేశ్ నిమజ్జనం – అన్నదాన కార్యక్రమం జరుగుతున్న సమయంలో హైదరాబాద్ మదన్నపేట 2బీహెచ్‌కే పోలీస్ హౌసింగ్ సొసైటీలో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నివాసితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే తెలిపిన వివరాల ప్రకారం.. నిమజ్జన ఊరేగింపు – అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో హౌసింగ్ కాంప్లెక్స్ నుంచి కిందికి మాంసాహార పదార్థాన్ని విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు దానిని బీఫ్‌గా పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మొహమ్మద్ ఇమ్రాన్ ఖురేషీ, అర్షియా బేగం, సమీనాలను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ కిరణ్ ఖరే తెలిపారు. కేసు దర్యాప్తు ఆధారంగా సంబంధిత కఠిన సెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.
ఘటన అనంతరం పలువురు నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ కూడా సాధారణ స్థితికి చేరుకుందని, నివాసితులు – నిరసనకారుల ఫిర్యాదులను పరిష్కరించామని పోలీసులు వెల్లడించారు.






