Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
అంతర్జాతీయ

భూటాన్‌ ఇంధన ప్రాజెక్టులకు రూ.4,000 కోట్ల రుణం!

జైశంకర్‌ పర్యటనలో కీలక ఒప్పందం జల విద్యుత్‌ ప్రాజెక్టులకు భారత్‌ మద్దతు డిజిటల్‌ చెల్లింపులు - రైలు మార్గాలపై చర్చలు
SAI MANIKANTA
September 19, 2026 · 3 days క్రితం
2 Views 1 Shares

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 18 (నవజ్యోతి ప్రతినిధి):

భారత్‌ – భూటాన్‌ మధ్య ఇంధన సహకారంలో మరో కీలక ముందడుగు పడింది. భూటాన్‌లో ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రూ.4,000 కోట్ల రాయితీతో కూడిన లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ఓసీ) అందించే ఒప్పందంపై ఇరు దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.

విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ సెప్టెంబర్‌ 16 నుంచి 18 వరకు భూటాన్‌లో అధికారికంగా పర్యటించారు. భూటాన్‌ విదేశాంగ – విదేశీ వాణిజ్య మంత్రి డీఎన్‌ ధుంగ్యేల్‌ ఆహ్వానం మేరకు జరిగిన ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ – అంతర్జాతీయ అంశాలపై ఇరు మంత్రులు చర్చించారు.

భారత్‌ – భూటాన్‌ ఇంధన భాగస్వామ్యంలో జరుగుతున్న పురోగతిపై ఇరు దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఇటీవల 1,020 మెగావాట్ల పునత్సాంగ్‌చు-2 జల విద్యుత్‌ ప్రాజెక్టు ప్రారంభం, దాని టారిఫ్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం, అలాగే 1,200 మెగావాట్ల పునత్సాంగ్‌చు-1 ప్రాజెక్టు డ్యామ్‌ నిర్మాణ పనుల పునఃప్రారంభాన్ని ఇరు దేశాలు ప్రస్తావించాయి.

భూటాన్‌లో జల విద్యుత్‌ ప్రాజెక్టుల్లో భారతీయ కంపెనీలు చురుకుగా భాగస్వామ్యం కావడాన్ని కూడా ఇరు దేశాలు స్వాగతించాయి. ఈ భాగస్వామ్యం ఇరుదేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఇంధన సహకారానికి మరింత ఊతమిస్తోందని పేర్కొన్నాయి.

జైశంకర్‌ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను సంయుక్తంగా ప్రారంభించారు. మోంగార్‌లో 65 పడకల గ్యాల్ట్సుయెన్‌ జెట్సున్‌ పెమా మదర్‌ అండ్‌ చైల్డ్‌ ఆసుపత్రి, సమ్‌ద్రుప్‌ జోంఖార్‌ – ట్రాషిగాంగ్‌ హైవేపై జగన్నాథన్‌ వంతెన, 500 కిలోవాట్ల లునానా జల విద్యుత్‌ ప్రాజెక్టు ఇందులో ఉన్నాయి.

భూటాన్‌ ప్రభుత్వానికి భారత్‌ నుంచి 54 ఎలక్ట్రిక్‌ వాహనాలు అందజేశారు. అలాగే భూటాన్‌లోని బుమ్‌థాంగ్‌ జాతీయ పశు సంతానోత్పత్తి కేంద్రానికి భారత్‌ నుంచి 43 జెర్సీ ఆవులను తరలించారు.

భూటాన్‌ 13వ పంచవర్ష ప్రణాళిక (2024-29)లోని అభివృద్ధి కార్యక్రమాలకు భారత్‌ మద్దతు కొనసాగిస్తుందని జైశంకర్‌ తెలిపారు. మరోవైపు భారత్‌ అభివృద్ధి ప్రాధాన్యతలకు అందిస్తున్న సహకారాన్ని భూటాన్‌ ప్రశంసించింది.

గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్‌ సిటీ, వాణిజ్యం – రవాణా, సరిహద్దు అనుసంధానం, డిజిటల్‌ చెల్లింపులు – అంతరిక్ష సహకారం వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి. గెలెఫుకు పెట్టుబడిదారులు – సందర్శకుల రాకపోకలను సులభతరం చేసేందుకు అసోంలోని హతిసార్‌లో ఇమ్మిగ్రేషన్‌ చెక్‌పోస్టు ఏర్పాటు చేయడానికి భారత్‌ కట్టుబడి ఉందని తెలిపింది.

గెలెఫు – కోక్రాజ్‌హార్‌, సమ్త్సే – బనార్‌హాట్‌ సరిహద్దు రైలు మార్గాల పనుల్లో పురోగతిని ఇరు దేశాలు గుర్తించాయి. భూటాన్‌ పౌరులు తమ మొబైల్‌ అప్లికేషన్ల ద్వారా భారత్‌లో యూపీఐ ఆధారిత డిజిటల్‌ చెల్లింపులు చేసే సదుపాయం అమల్లోకి రావడాన్ని కూడా స్వాగతించాయి.

విద్యా రంగంలో సహకారాన్ని పెంచుతూ భారత సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్‌) స్కాలర్‌షిప్‌ కింద అర్హత పొందే భూటాన్‌ విద్యార్థుల సంఖ్యను 30 నుంచి 60కి, నలందా యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌ కింద సీట్లను 30 నుంచి 55కి పెంచేందుకు అంగీకారం కుదిరింది.

2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యత్వానికి భారత్‌ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపినందుకు భూటాన్‌కు భారత్‌ కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్‌ అలయన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఒప్పందాన్ని భూటాన్‌ ఆమోదించడాన్ని భారత్‌ స్వాగతించింది.

భూటాన్‌ ఇంధన రంగానికి రూ.4,000 కోట్ల రుణ సదుపాయం
జల విద్యుత్‌ ప్రాజెక్టుల్లో భారతీయ కంపెనీల భాగస్వామ్యం
యూపీఐ, సరిహద్దు రైలు మార్గాలు – విద్యా సహకారంపై కీలక చర్చలు