నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ దాడి !
జూనియర్ అసిస్టెంట్ – ఔట్సోర్సింగ్ ఉద్యోగి అరెస్ట్
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు సిబ్బంది రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ విడుదల చేసిన ప్రెస్‌నోట్ ప్రకారం.. మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పాల్డా అశోక్, ఆడిట్ విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న కలకుంట్ల కిరణ్‌కుమార్ ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
ఫిర్యాదుదారుడి తల్లికి నెలవారీ పింఛన్ మంజూరు చేసేందుకు అవసరమైన ఇన్క్రిమెంట్ ప్రొసీడింగ్స్ సిద్ధం చేయడంతో పాటు, ఆమె సర్వీస్ బుక్‌లో అవసరమైన ఎంట్రీలు – ఇతర వివరాలు నమోదు చేసేందుకు ఇద్దరూ కలిసి రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.
సెప్టెంబర్ 21న ఉదయం సుమారు 11.18 గంటలకు నిజామాబాద్ పట్టణంలోని రాజా రాజేంద్ర చౌరస్తా సమీపంలోని సీతారాంనగర్ కాలనీలోని పద్మశాలి సంఘం వద్ద లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు ఇద్దరినీ పట్టుకున్నట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.
లంచం మొత్తాన్ని స్వీకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరినీ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్ నాంపల్లిలోని ఎస్పీఈ – ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులు తమ అధికారిక విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు లంచం స్వీకరించినట్లు ఏసీబీ ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉందని అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుడి పేరు – వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.






