ఫ్రాన్స్‌లో భగ్గుమన్న ఆందోళనలు..మున్సిపల్ భవనానికి నిప్పు, దుకాణాల్లో దోపిడీ!
పారిస్, అక్టోబర్ 18: పెరుగుతున్న జీవన వ్యయం, ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రజాసేవల నాణ్యతపై అసంతృప్తితో ఫ్రాన్స్‌లో శనివారం జరిగిన భారీ నిరసనలు పలు నగరాల్లో హింసాత్మకంగా మారాయి. ప్రదర్శనల్లో వందలాది దుకాణాలు ధ్వంసం కాగా, కొన్ని ప్రాంతాల్లో లూటీలు, నిప్పంటించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. లిమోజ్ నగరంలోని చారిత్రక మున్సిపల్ భవనానికి నిప్పంటించడంతో మంటలు పైకప్పు వరకు వ్యాపించాయి. లియోన్‌లోని పర్యాటక కార్యాలయానికీ నిప్పంటించారు. మార్సెయి, లిల్లే నగరాల్లోని మున్సిపల్ కార్యాలయాల్లోకి చొరబడిన నిరసనకారులు భవనాలను ధ్వంసం చేశారు.
పారిస్‌లో లగ్జరీ దుకాణాలు, బట్టల షాపులు, మొబైల్ ఫోన్ దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు జరిగాయి. గ్యాలరీస్ లఫాయెట్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించగా, లాకోస్ట్ దుకాణం, ఎస్‌ఎఫ్‌ఆర్ మొబైల్ షాపుతోపాటు పలు వ్యాపార సంస్థలు ధ్వంసమయ్యాయి. బ్యాంకులపై దాడులు, పార్క్ చేసిన కార్లకు నిప్పంటించిన ఘటనలు కూడా నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో బాష్పవాయువు, వాటర్ క్యానన్లను ఉపయోగించారు.
ఫ్రాన్స్ అంతటా సుమారు 5.5 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ న్యూనెజ్ తెలిపారు. నిర్వాహకులు మాత్రం ఈ సంఖ్య 8 లక్షల వరకు ఉందని పేర్కొన్నారు. తాజా నివేదికల్లో 1,200 మందికి పైగా అరెస్టయినట్లు వెల్లడైంది. 150 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడినట్లు ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తెలిపారు. సెయింట్ ఎటియెన్‌లో పోలీసుల గుంపు నియంత్రణ గ్రెనేడ్‌కు సంబంధించిన ఘటనలో ఓ యువకుడి చేతికి తీవ్ర గాయమైంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
దేశంలో హింసకు తావులేదని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలపై దాడులు చేసి, మున్సిపల్ భవనాలను దోచుకున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రజల హక్కులను గౌరవిస్తూనే, హింసకు పాల్పడినవారిని శిక్షిస్తామని పేర్కొన్నారు. పోలీసులకు తన మద్దతు ప్రకటించారు.
ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను హింసకు తీవ్రవాద వామపక్ష వర్గాలు, విధ్వంసానికి పాల్పడిన నేరస్థులే కారణమని ఆరోపించారు. హింస ద్వారా రాజకీయ ఎజెండాను రుద్దేందుకు ఎవరినీ అనుమతించబోమని హెచ్చరించారు. విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచే వసూలు చేసేలా చట్టపరమైన చర్యలను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫ్రాన్స్‌లోని ఘటనలపై స్పందిస్తూ వలస విధానాలను విమర్శించారు.
ఈ నిరసనలకు ఇటీవలి వారాల్లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు కూడా నేపథ్యంగా ఉన్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, అధ్వాన్నమైన సౌకర్యాలు, విద్యా నిధులపై అసంతృప్తితో మొదలైన నిరసనలు క్రమంగా జీవన వ్యయం, ఆర్థిక అసమానతలు, ప్రభుత్వ సేవలపై ఆగ్రహంగా విస్తరించాయి. 2018లో ఇంధన ధరల పెరుగుదలపై మొదలైన ‘యెల్లో వెస్ట్స్’ ఉద్యమాన్ని తాజా ఆందోళనలు గుర్తుచేస్తున్నాయి. అయితే శాంతియుతంగా నిరసన తెలిపినవారితో పాటు హింసకు పాల్పడినవారిని వేర్వేరుగా చూడాలని పలువురు ఆందోళనకారులు పేర్కొన్నారు.






