Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
తెలంగాణ

తెలంగాణ ఉద్యమ కుటుంబాలకు రూ.15 లక్షల సాయం !

రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న రెండు కుటుంబాలకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి ఆర్థిక సాయం మంజూరు చేశారు.
SAI MANIKANTA
September 21, 2026 · 4 hours క్రితం
6 Views 1 Shares

మండల రాజు కుటుంబానికి రూ.5 లక్షలు మంజూరు

లింగాల కేదారి కుటుంబానికి రూ.10 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం
ఉద్యమ సమయంలో కుటుంబాలకు అండగా నిలిచిన వారిని గుర్తించిన ప్రభుత్వం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 (నవజ్యోతి ప్రతినిధి):

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న రెండు కుటుంబాలకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి ఆర్థిక సాయం మంజూరు చేశారు. సోమవారం ఉద్యమకారుడు మండల రాజు కుటుంబానికి రూ.5 లక్షలు, దివంగత లింగాల కేదారి కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో అదృశ్యమైన మండల రాజు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గోర్లవేడు గ్రామానికి చెందిన మండల రాజు, మండల సమ్మిరెడ్డి కుమారుడు. ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయనను అరెస్టు చేసి చర్లపల్లి సెంట్రల్‌ జైలులో నిర్బంధించినట్లు రికార్డుల్లో ఉంది.

2013 జూన్‌ 20న రాజు అదృశ్యమయ్యారు. వృద్ధులైన తల్లిదండ్రులకు రాజు ఒక్కగానొక్క కుమారుడు కావడంతో ఆయన అదృశ్యం తర్వాత కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఉద్యమ అమరవీరుల కోటా కింద కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి రూ.5 లక్షలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు తెలంగాణ ఉద్యమ తుది దశలో కార్యకర్తలకు సేవలందించిన దివంగత లింగాల కేదారి కుటుంబానికి రూ.10 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం మంజూరు చేశారు. హనుమకొండలోని శాంతినగర్‌ – పోస్టల్‌ కాలనీలో కేదారి దంపతులు చిన్న హోటల్‌ నిర్వహించేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కార్యకర్తలకు ఉచితంగా భోజనం, టిఫిన్‌, టీ అందిస్తూ ఉద్యమానికి తమ వంతు సహకారం అందించారు.

లింగాల కేదారి సెప్టెంబర్‌ 9న మృతి చెందగా, ఆయన భార్య పుష్పలత సెప్టెంబర్‌ 10న మృతి చెందారు. ఉద్యమ సమయంలో వారు అందించిన సేవలను గుర్తు చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ.10 లక్షల సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

రెండు కుటుంబాలకు మంజూరైన ఆర్థిక సాయం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వివిధ రూపాల్లో పాల్గొన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ నిర్ణయం ద్వారా స్పష్టం చేశారు.

మండల రాజు కుటుంబానికి రూ.5 లక్షలు • లింగాల కేదారి కుటుంబానికి రూ.10 లక్షలు • మొత్తం రూ.15 లక్షల ఆర్థిక సాయం