Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
మేడ్చల్ మల్కాజిగిరి

ఫైళ్లలో ఇండస్ట్రీ కారిడార్.. క్షేత్రంలో గుంతల కారిడార్ !

రాత్రివేళ ప్రయాణమంటేనే రిస్క్‌.. రోడ్డు దుస్థితితో వాహనదారులకు నరకయాతన పన్నులు వసూలు చేస్తున్నా.. రోడ్డు మరమ్మతులు ఎప్పుడంటున్న పారిశ్రామికవేత్తలు
SAI MANIKANTA
September 21, 2026 · 15 hours క్రితం
35 Views 2 Shares

కుత్బుల్లాపూర్‌, సెప్టెంబర్‌ 21 (నవజ్యోతి ప్రతినిధి):

పరిశ్రమలు పెరుగుతున్నాయి.. వాహనాల రాకపోకలు పెరుగుతున్నాయి.. పన్నులు మాత్రం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. కానీ పారిశ్రామిక ప్రాంతానికి కీలకమైన ప్రధాన రహదారి మాత్రం గుంతలమయంగా మారింది. దూలపల్లి పారిశ్రామిక వాడ నుంచి జీడిమెట్ల పారిశ్రామిక వాడకు వెళ్లే మార్గం అధ్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి పరిస్థితి చూస్తే ఇది ఇండస్ట్రీ కారిడారా.. గుంతల బాటా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడినా కనీస మరమ్మతులు చేపట్టకపోవడంపై స్థానికులు, పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. సమస్య కళ్లముందే కనిపిస్తున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం ఏమిటని నిలదీస్తున్నారు. రోడ్డు పూర్తిగా దెబ్బతిన్న తర్వాతే చర్యలు తీసుకోవాలా? ప్రమాదం జరిగే వరకు వేచి చూడాల్సిందేనా? అని ప్రశ్నిస్తున్నారు.

వర్షం పడినప్పుడు గుంతల్లో నీరు చేరడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. గుంతల లోతు తెలియక ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పే ప్రమాదం ఉంది. రాత్రివేళల్లో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదం మరింత పెరుగుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే గుంతలను పూడ్చాల్సిన అవసరం ఉందని వాహనదారులు కోరుతున్నారు.

భారీ గుంతలను తప్పించుకునేందుకు వాహనాలు అటూఇటూ మళ్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో రహదారి దుస్థితి ట్రాఫిక్ సమస్యకు కూడా కారణమవుతోంది. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు ఈ మార్గం కీలకం కావడంతో రవాణాపైనా ప్రభావం పడుతోంది.

పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రహదారులు, డ్రైనేజీ, విద్యుత్తు తదితర మౌలిక వసతులు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. పరిశ్రమల కార్యకలాపాలు, వాహనాల రాకపోకలు పెరుగుతున్నా ప్రధాన రహదారి గుంతలతో ఉండటం మౌలిక వసతుల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

అత్యవసరంగా గుంతలను పూడ్చి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. అదే సమయంలో రహదారి పరిస్థితిని సాంకేతికంగా పరిశీలించి, అవసరమైన ప్రాంతాల్లో నాణ్యమైన బీటీ లేదా సీసీ రహదారి నిర్మాణం చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజలు, వ్యాపార సంస్థలు పన్నులు చెల్లిస్తున్న నేపథ్యంలో మౌలిక వసతుల నిర్వహణ కూడా సంబంధిత ప్రభుత్వ విభాగాల బాధ్యతేనని స్థానికులు పేర్కొంటున్నారు. గుంతలు ఏర్పడిన విషయం తెలిసినా ఇప్పటివరకు ఎందుకు మరమ్మతులు చేపట్టలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రహదారి నిర్వహణకు బాధ్యులైన విభాగం ఏది? ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణ మరమ్మతులతో పాటు శాశ్వత రహదారి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

పరిశ్రమల అభివృద్ధికి అనుగుణంగా రహదారి మౌలిక వసతులను కూడా మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు.