Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
హైదరాబాద్

లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్యక్తి.. గంటన్నర తర్వాత సురక్షితంగా బయటకు !

40 ఏళ్ల మురళి
SAI MANIKANTA
September 20, 2026 · 1 day క్రితం
8 Views 1 Shares

రెండో – మూడో అంతస్తుల మధ్య ప్రమాదకర స్థితిలో చిక్కుకున్న 40 ఏళ్ల మురళి

హైడ్రా డీఆర్‌ఎఫ్‌ బృందం – అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా రెస్క్యూ
హైడ్రాలిక్‌ కట్టర్‌తో లిఫ్ట్‌ గోడ తొలగింపు.. కాలికి ఫ్రాక్చర్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (నవజ్యోతి ప్రతినిధి):

హైదరాబాద్‌ మూసాపేటలో లిఫ్ట్‌ ప్రమాదం చోటుచేసుకుంది. పాతకాలం నాటి గ్రిల్‌తో కూడిన లిఫ్ట్‌లో నుంచి బయటకు వస్తుండగా అది అకస్మాత్తుగా పైకి కదలడంతో 40 ఏళ్ల మురళి రెండో – మూడో అంతస్తుల మధ్య ఇరుక్కుపోయాడు. సుమారు గంటన్నర పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌ అనంతరం అతడిని సురక్షితంగా బయటకు తీశారు.

మూసాపేటలోని అంజనేయనగర్‌లో ఈ ఘటన జరిగింది. మూడు అంతస్తుల భవనంలోని లిఫ్ట్‌లో మురళి తన భార్యతో కలిసి గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి రెండో అంతస్తుకు వెళ్లాడు. లిఫ్ట్‌ రెండో అంతస్తుకు చేరుకున్న తర్వాత మురళి బయటకు వస్తుండగా.. మూడో అంతస్తులో ఉన్న మరో వ్యక్తి లిఫ్ట్‌ బటన్‌ నొక్కినట్లు సమాచారం.

దీంతో మురళి పూర్తిగా బయటకు రాకముందే లిఫ్ట్‌ పైకి కదిలింది. ఒక కాలు లిఫ్ట్‌లో, మరో కాలు రెండో అంతస్తు ల్యాండింగ్‌పై ఉండటంతో అతడి కాలు లిఫ్ట్‌ గ్రిల్‌లో చిక్కుకుంది. దీంతో రెండో – మూడో అంతస్తుల మధ్య ప్రమాదకర స్థితిలో వేలాడుతూ ఉండిపోయాడు. లిఫ్ట్‌లోనే ఉన్న అతడి భార్య కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని రక్షించే ప్రయత్నం చేశారు.

స్థానికులు మురళిని బయటకు తీయలేకపోవడంతో ఉదయం 9:15 గంటలకు హైడ్రా కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుకట్‌పల్లి ప్రాంతానికి చెందిన హైడ్రా డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీఆర్‌ఎఫ్‌) బృందం సుమారు 15 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకుంది.

హైడ్రా మార్షల్‌ జేడీవీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. లిఫ్ట్‌ – గోడ మధ్య మురళి చిక్కుకున్నట్లు గుర్తించిన సిబ్బంది అతడిని బయటకు తీసేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో లిఫ్ట్‌ గోడలో కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది.

సనత్‌నగర్‌ అగ్నిమాపక కేంద్రానికి చెందిన సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అడ్డంకిని తొలగించేందుకు హైడ్రాలిక్‌ కట్టర్‌ను ఉపయోగించారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించిన అనంతరం ఉదయం 10:50 గంటల సమయంలో మురళిని బయటకు తీశారు.

లిఫ్ట్‌ – గోడ మధ్య కాలు ఇరుక్కోవడంతో మురళికి కాలికి ఫ్రాక్చర్‌ అయినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో సనత్‌నగర్‌ అగ్నిమాపక కేంద్రం సిబ్బందితో పాటు హైడ్రా డీఆర్‌ఎఫ్‌ సభ్యులు మార్షల్‌ జేడీవీ ప్రసాద్‌, ఎర్రసాని అనిల్‌ కుమార్‌, జమ్మ రమేష్‌, వీతా రమేష్‌, పల్లికమిట్టి గోపీ పాల్గొన్నారు. పోలీసు కానిస్టేబుల్‌ నరేష్‌ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.