Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
అంతర్జాతీయ

తేజస్‌లో భారత్‌ – జపాన్‌ వైమానిక దళాధిపతులు !

‘వీర్‌ గార్డియన్‌-2026’
SAI MANIKANTA
September 20, 2026 · 1 day క్రితం
3 Views 1 Shares

జోధ్‌పూర్‌లో వీర్‌ గార్డియన్‌-2026 వైమానిక విన్యాసాలు

తేజస్‌, సుఖోయ్‌-30ఎంకేఐ, రాఫెల్‌.. జపాన్‌ ఎఫ్‌-2ఏ యుద్ధవిమానాలు
భారత గడ్డపై తొలిసారిగా జపాన్‌ ఎఫ్‌-2ఏ కార్యకలాపాలు
జోధ్‌పూర్‌, సెప్టెంబర్‌ 20 (నవజ్యోతి ప్రతినిధి):

భారత్‌ – జపాన్‌ మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వైమానిక విన్యాసాలు ‘వీర్‌ గార్డియన్‌-2026’లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. భారత వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌, జపాన్‌ ఎయిర్‌ సెల్ఫ్‌-డిఫెన్స్‌ ఫోర్స్‌ చీఫ్‌ జనరల్‌ టకేహిరో మోరిటా జోధ్‌పూర్‌లో తేజస్‌ యుద్ధవిమానంలో ప్రయాణించారు.

ఈ విన్యాసంలో భారత వైమానిక దళానికి చెందిన స్వదేశీ తేజస్‌, సుఖోయ్‌-30ఎంకేఐ, రాఫెల్‌ యుద్ధవిమానాలతో పాటు జపాన్‌ వైమానిక దళానికి చెందిన ఎఫ్‌-2ఏ విమానాలు పాల్గొంటున్నాయి. ఇరు దేశాల వైమానిక దళాల మధ్య ఆపరేషనల్‌ సమన్వయం, మిషన్‌ ప్లానింగ్‌ – సాంకేతిక అవగాహన పెంపొందించడమే ఈ విన్యాసం ప్రధాన ఉద్దేశం.

ఈ విన్యాసంలో జపాన్‌ ఎఫ్‌-2ఏ యుద్ధవిమానాలు భారత గడ్డపై తొలిసారిగా కార్యకలాపాలు నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది. ఇరు దేశాల వైమానిక దళాలు తమ యుద్ధవిమానాలతో సంయుక్త శిక్షణ నిర్వహిస్తూ పరస్పర ఆపరేషనల్‌ విధానాలను అర్థం చేసుకుంటున్నాయి.

జపాన్‌ వైమానిక దళాధిపతి జనరల్‌ మోరిటా తేజస్‌లో పైలట్‌తో కలిసి ప్రయాణించగా, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ తేజస్‌లో సోలో సార్టీ నిర్వహించారు. అనంతరం ఇరువురు వైమానిక దళాధిపతులు పరస్పరం బాడ్జ్‌లను మార్చుకున్నారు.

తేజస్‌ ప్రయాణం తనకు విలువైన అనుభవమని జనరల్‌ మోరిటా పేర్కొన్నారు. భారత రక్షణ సాంకేతిక సామర్థ్యానికి తేజస్‌ ఒక ముఖ్యమైన ప్రతీకగా నిలుస్తోందని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.

సెప్టెంబర్‌ 9 నుంచి 22 వరకు జోధ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఈ వైమానిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. అధునాతన వైమానిక కార్యకలాపాలతో పాటు ఇంజినీరింగ్‌, ఏరోస్పేస్‌ భద్రత, మిషన్‌ ప్లానింగ్‌ వంటి అంశాల్లో ఇరు దేశాల సిబ్బంది పరస్పరం అనుభవాలను పంచుకుంటున్నారు.

సంయుక్త శిక్షణ ద్వారా ఇరు వైమానిక దళాల మధ్య పరస్పర అవగాహన – వృత్తిపరమైన సహకారం మరింత పెరగనుంది. తేజస్‌, సుఖోయ్‌-30ఎంకేఐ, రాఫెల్‌ – ఎఫ్‌-2ఏ వంటి యుద్ధవిమానాల భాగస్వామ్యంతో వీర్‌ గార్డియన్‌-2026 కొనసాగుతోంది.