Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
తాజా వార్తలు

ఈపీఎఫ్‌ బీమా కవరేజీ

సాధారణంగా ఈపీఎఫ్ ఖాతా కలిగిన ప్రతి ఉద్యోగికి ఈడీఎల్ఐ ద్వారా ఉచిత జీవిత బీమా సౌకర్యం
LAXMAN
September 20, 2026 · 1 day క్రితం
3 Views 0 Shares

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వేతన పరిమితి పెంపునకు తగినట్లుగా ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకం కింద లభించే జీవిత బీమా ప్రయోజనాలను పెంచకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ వేతన గరిష్ఠ పరిమితిని నెలకు రూ. 15,000 నుంచి రూ. 25,000 కు పెంచినప్పటికీ, ఈడీఎల్ఐ ఉచిత బీమా గరిష్ఠ కవరేజీని మాత్రం పెంచలేదు. దీంతో ఉద్యోగ భవిష్య నిధి ఖాతాదారులు దాదాపు రూ. 3.50 లక్షల వరకు జీవిత బీమా రక్షణను కోల్పోవాల్సి వస్తోంది. సాధారణంగా ఈపీఎఫ్ ఖాతా కలిగిన ప్రతి ఉద్యోగికి ఈడీఎల్ఐ ద్వారా ఉచిత జీవిత బీమా సౌకర్యం లభిస్తుంది. సర్వీస్‌లో ఉండగా ఉద్యోగి దురదృష్టవశాత్తు మరణిస్తే, వారి కుటుంబ సభ్యులకు లేదా నామినీకి ఈ బీమా పరిహారం అందుతుంది. దీనికి సంబంధించి ఉద్యోగి పనిచేసే సంస్థే నెలనెలా ప్రీమియం చెల్లిస్తుంది. గతంలో బేసిక్ పే మరియు డీఏలో 0.5 శాతంగా ఉన్న గరిష్ఠ ప్రీమియం రూ. 75 నుంచి రూ. 125 కు పెరిగినప్పటికీ, మరణానంతరం లభించే బీమా మొత్తంలో మార్పు లేదు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం కనీస బీమా పరిహారం రూ. 2.50 లక్షలుగా, గరిష్ఠ బీమా పరిహారం రూ. 7 లక్షలుగా ఉంది. 2014 సెప్టెంబర్‌లో వేతన పరిమితిని రూ. 15,000 కు పెంచిన సమయంలో గరిష్ఠ బీమాను రూ. 6 లక్షలకు సవరించారు. ఆ తర్వాత 2021 ఏప్రిల్‌లో దీనిని ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా రూ. 7 లక్షలకు పెంచారు. ఇప్పుడు వేతన పరిమితి రూ. 10,000 వరకు పెరిగినందున, బీమా పరిమితిని కూడా రూ. 10.50 లక్షలకు పెంచాలని కార్మిక సంఘాలు మరియు ఆర్థిక నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బీమా పరిమితి పెంపుపై నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.