కేతన్ హత్య కేసులో 5,053 పేజీల ఛార్జ్‌షీట్ !
కాబోయే భార్య సహా ముగ్గురిపై అభియోగాలు
మహారాష్ట్రలోని పుణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. కేతన్‌ను లోహగఢ్ కోటపై నుంచి తోసివేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కాబోయే భార్య సియా ప్రవీణ్ గోయల్, ఆమెతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చేతన్ బాబులాల్ చౌధరి, రితేశ్ సంజయ్ హంగేపై పోలీసులు వడ్గావ్ మావల్ కోర్టులో 5,053 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ముగ్గురూ ప్రస్తుతం జైలులో ఉన్నారు.
కేతన్‌ను తీవ్రంగా గాయపర్చేందుకు తొలుత నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు ఆరోపించారు. ఇందుకోసం మహారాష్ట్ర వెలుపల కొందరిని సంప్రదించినప్పటికీ.. ఈ విషయం పోలీసులకు తెలిసే అవకాశం ఉందని భావించి ఆ ప్రణాళికను విరమించుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో సంప్రదించిన వారిలో ఒకరు ప్రస్తుతం కేసులో సాక్షిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం కేతన్‌ను తామే హత్య చేయాలని నిందితులు నిర్ణయించుకున్నారని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. హత్యల ఆధారంగా రూపొందిన సినిమాలు చూడటంతో పాటు, పోలీసులకు చిక్కకుండా ఉండే మార్గాలపై పాడ్‌కాస్ట్‌లు విన్నారని ఆరోపించారు. మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసును కూడా పరిశీలించినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
లోహగఢ్‌ను ఎంచుకోవడానికి ముందు లొనావాలా పరిసరాల్లోని పలు ప్రాంతాలను నిందితులు పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. మే చివర్లో సియా – చేతన్ టైగర్ పాయింట్ తదితర ప్రాంతాలను సందర్శించి ఒంటరి ప్రదేశాల కోసం వెతికారని పేర్కొన్నారు. టైగర్ పాయింట్‌లో సీసీటీవీ కెమెరాలు లేవని గుర్తించినప్పటికీ.. గతంలో అక్కడ ఒక మహిళ మృతి చెందిన ఘటన నేపథ్యంలో చివరకు లోహగఢ్‌ను ఎంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
జూన్ 14న సియా – కేతన్ లోహగఢ్‌కు వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. అక్కడ కేతన్‌ను తోసేందుకు సియా ప్రయత్నించినప్పటికీ తొలి ప్రయత్నం విఫలమైందని తెలిపారు. అనంతరం పాము ఉందని చెప్పి అతడిని అంచువైపు వెళ్లేలా చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు.
జూన్ 18న ‘మాహి’ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. పరిచయమున్న ఓ యువతి ఫొటోను ఉపయోగించి రూపొందించిన ఆ ఖాతా ద్వారా కేతన్‌కు సందేశాలు పంపినట్లు ఆరోపించారు. ‘మాహి’ తన స్నేహితురాలని నమ్మేలా చేసి.. ఆమె పుట్టినరోజు సర్‌ప్రైజ్ కోసం సియాను లోహగఢ్‌కు తీసుకెళ్లేలా కేతన్‌ను ప్రేరేపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. హంగే రూపొందించిన ఈ ఖాతాను హత్య అనంతరం తొలగించినట్లు ఛార్జ్‌షీట్‌లో తెలిపారు.
ఈ కేసులో 100 మందికి పైగా సాక్షులను పోలీసులు చేర్చారు. వీరిలో ఐదుగురు ప్రత్యక్ష సాక్షులు ఉన్నట్లు పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ డేటా, వాట్సాప్ చాట్లు, ఫొటోలు, కాల్ డీటెయిల్ రికార్డులు, సాంకేతిక విశ్లేషణతో పాటు ఇతర డిజిటల్ ఆధారాలను కూడా ఛార్జ్‌షీట్‌లో సమర్పించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులపై పోలీసులు చేసిన ఆరోపణలు ప్రస్తుతం ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న అభియోగాలుగా ఉన్నాయి. కేసు విచారణలో సాక్ష్యాలు, డిజిటల్ ఆధారాలు – ఇతర అంశాలను కోర్టు పరిశీలించనుంది.






