కుత్బుల్లాపూర్ పోలీసుల చాకచక్యం.. 426 కిలోల గంజాయి సీజ్!
ఒడిశా నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు డీసీఎంలో భారీగా గంజాయిని తరలిస్తున్న ముఠాను కుత్బుల్లాపూర్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. సెప్టెంబర్ 18న రాత్రి ఔటర్ రింగ్‌రోడ్ ఎగ్జిట్ నంబర్-5 దుండిగల్ సర్వీస్ రోడ్డుపై నిఘా పెట్టిన పోలీసులు.. గంజాయి తరలిస్తున్న డీసీఎంతో పాటు దానికి ఎస్కార్ట్‌గా వెళ్తున్న స్విఫ్ట్ కారును గుర్తించి తనిఖీ చేశారు. డీసీఎంలో 426 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో సురంగిని పరిచ్ఛా అలియాస్ సునీత, బాలు గణపత్ కదమ్ అలియాస్ నానా, ఉపలబ్ధ్ మంగళేష్ భోస్లే అలియాస్ వికాస్ భోస్లే, శంకర్ గోకుల్ థోరట్ అలియాస్ సోము, రాజా చవాన్, అరుణ్ బాబురావు చేందకేలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు.
మరో ఇద్దరు నిందితులు అవినాష్ బాబు రాథోడ్, అభిజిత్ థాటే పోలీసులకు చిక్కకుండా పరారైనట్లు అధికారులు తెలిపారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
పోలీసులు 426 కిలోల గంజాయి, సిల్వర్ కలర్ స్విఫ్ట్ కారు (OD02 D3300), ఎయిచర్ డీసీఎం (MH13BQ5332), సెల్‌ఫోన్లు – కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.2,28,87,350 ఉంటుందని ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.
ఈ ఘటనపై దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 931/2026గా NDPS చట్టంలోని సెక్షన్ 8(c), 20(b)(ii)(C), 29 కింద కేసు నమోదు చేశారు. గంజాయి ఎక్కడి నుంచి సేకరించారు.. సోలాపూర్‌లో ఎవరికి తరలిస్తున్నారు.. ఈ రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్ ఎవరన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, మెద్చల్ జోన్ డీసీపీ పీ. శోభన్ కుమార్, ఎస్‌ఓటీ అడిషనల్ కమిషనర్ చె. శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. ఆపరేషన్‌లో పాల్గొన్న ఎస్‌ఓటీ – దుండిగల్ పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.
“`0






