ఒక్కటే గణపతి.. గ్రామమంతా ఒక్కటే భక్తి భావం
భిక్కనూరు మండలం గుర్జకుంట గ్రామం వినాయక చవితి వేడుకల్లో ప్రత్యేకతను చాటుకుంటోంది. గ్రామంలో 2013 నుంచి ఒకే గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గ్రామస్తులంతా కలిసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 2012లో చోటుచేసుకున్న కొన్ని అనివార్య పరిస్థితుల నేపథ్యంలో గ్రామస్తులంతా ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అప్పటి నుంచి కులాలు, సంఘాల భేదాలకు తావులేకుండా గ్రామమంతా ఒకే మండపంలో గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది మండప నిర్వహణ బాధ్యతలను కూడా గ్రామస్తులంతా కలిసి చేపడుతున్నారు.
ఇందులో భాగంగా శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భిక్కనూరు ఎస్ఐ అనిల్ పోలీసు సిబ్బందితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండప నిర్వాహకులు – గ్రామస్తులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణపై పలు సూచనలు చేశారు.
వినాయక మండపాల వద్ద డీజే స్పీకర్ల వినియోగం నిషేధమని ఎస్ఐ అనిల్ తెలిపారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా మండప నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. గుర్జకుంటలో కులాలు – సంఘాల భేదాలకు తావులేకుండా గ్రామమంతా కలిసి ఒకే గణపతిని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు.
మండపాల నిర్వహణ – భద్రతా ఏర్పాట్లను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని ఎస్ఐ అనిల్ తెలిపారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు సహకరించాలని సూచించారు.
కార్యక్రమంలో సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి, ఉపసర్పంచ్ గొల్ల సంతోష్ యాదవ్, గ్రామ పాలకవర్గ సభ్యులు, పోలీసు సిబ్బంది – గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






