కలంతోనే కాదు.. రక్తంతోనూ ప్రాణరక్షణ!
సంగారెడ్డి, సెప్టెంబర్ 19 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 22న రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ ఐబీ ప్రాంగణంలో ఉదయం 10.30 గంటలకు శిబిరం ప్రారంభం కానుంది. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. ఫైసల్‌తో పాటు జిల్లా ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.
జన్మదిన వేడుకలను వ్యక్తిగత సంబరాలకు పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా నిర్వహించాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేక పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్వచ్ఛంద రక్తదానం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.
ఆరోగ్యవంతులైన యువత, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడగలదని, రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంతో పాటు సామాజిక బాధ్యతను చాటుకోవచ్చని పేర్కొన్నారు. రక్తదానం చేయదలచిన వారు సెప్టెంబర్ 22న సకాలంలో ప్రభుత్వ ఐబీ ప్రాంగణానికి చేరుకుని ప్రాణదాతలుగా నిలవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.






