Saturday, September 19, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
కామారెడ్డి

ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరలింపుపై కెమికల్ కంపెనీల ఎదుట ధర్నా!

రూ.200 కోట్ల విద్యా ప్రాజెక్టును బిక్కనూరులోనే కొనసాగించాలని డిమాండ్ బస్వాపూర్ - జంగంపల్లి ప్రధాన రహదారి వెంట స్థలాల పరిశీలనకు ప్రజల సూచన అనువైన స్థలం గుర్తించి బిక్కనూరు మండలంలోనే స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రజలు
SAI MANIKANTA
September 19, 2026 · 4 hours క్రితం
225 Views 6 Shares
బిక్కనూరు, సెప్టెంబర్ 19 (నవజ్యోతి ప్రతినిధి):

బిక్కనూరుకు మంజూరైన రూ.200 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఇతర మండలానికి తరలించడాన్ని నిరసిస్తూ వార్డు సభ్యులు కెమికల్ కంపెనీల ఎదుట ధర్నా నిర్వహించారు. కెమికల్ కంపెనీల కారణంగానే స్కూల్ తరలిపోయిందని ఆరోపిస్తూ.. బిక్కనూరులోని మూడు కంపెనీలను తరిమికొట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను బిక్కనూరులోనే సాధించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

అయితే స్కూల్ తరలింపుపై ప్రధానంగా స్థల ఎంపిక అంశం తెరపైకి వచ్చింది. బిక్కనూరులో ఇప్పటికే రెండు స్థలాలను పరిశీలించినప్పటికీ.. పాఠశాల ఏర్పాటుకు అనువుగా లేకపోవడంతో వాటిని అధికారులు పక్కన పెట్టినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కెమికల్ కంపెనీలను మాత్రమే కారణంగా చూపడం కాకుండా.. బిక్కనూరు మండల పరిధిలోనే మరోసారి విస్తృతంగా స్థలాల పరిశీలన చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా బస్వాపూర్ నుంచి జంగంపల్లి వరకు ఉన్న ప్రధాన రహదారి వెంబడి ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు అనువైన ప్రభుత్వ లేదా ఇతర అందుబాటులో ఉన్న స్థలాలు ఉన్నాయా అనే అంశాన్ని అధికారులు పరిశీలించాలని ప్రజలు సూచిస్తున్నారు.

విద్యార్థులకు రవాణా సౌకర్యం, రహదారి అనుసంధానం, భవిష్యత్ అవసరాలకు సరిపడే విస్తీర్ణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ మార్గంలో అనువైన స్థలాన్ని గుర్తిస్తే.. రూ.200 కోట్ల విద్యా ప్రాజెక్టును బిక్కనూరు మండలంలోనే కొనసాగించే అవకాశం ఉంటుందని ప్రజలు పేర్కొంటున్నారు.

ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టు క్యాసంపల్లి కి వెళ్లకుండా.. బిక్కనూరు మండలంలో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ స్థలాలను అధికారులు పరిశీలించి, అనువైన స్థలాన్ని ఎంపిక చేసి అక్కడే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ధర్నాలో వార్డు సభ్యులు  కర్రోళ్ల రాజు, గజ్జ వేణు, దుభాష్ పంచాక్షరి, ఆకుల రవి పాల్గొన్నారు.