నిమజ్జన వేళ.. ట్రాఫిక్ రూట్లు మార్పు!
గణేష్ నిమజ్జనోత్సవాల నేపథ్యంలో సూరారం కట్టమైసమ్మ చెరువు (లింగం చెరువు) వద్ద ట్రాఫిక్ నియంత్రణకు జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
నిమజ్జన సమయంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు బహదూర్‌పల్లి నుంచి సూరారం జంక్షన్ వరకు భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే భారీ వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
గండిమైసమ్మ వైపు నుంచి జీడిమెట్ల – బాలానగర్ వైపు వెళ్లే భారీ వాహనాలను బహదూర్‌పల్లి జంక్షన్ నుంచి దూలపల్లి గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కుడివైపు మళ్లించనున్నారు. అక్కడి నుంచి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా – షాపూర్‌నగర్ మీదుగా బాలానగర్ వైపు వాహనాలను పంపించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అదే విధంగా బాలానగర్ – జీడిమెట్ల వైపు నుంచి గండిమైసమ్మ వైపు వెళ్లే భారీ వాహనాలను జేఈటీఎల్ నుంచి దూలపల్లి గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వైపు మళ్లించనున్నారు. అక్కడి నుంచి బహదూర్‌పల్లి జంక్షన్ మీదుగా గండిమైసమ్మ వైపు వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేశారు.
నిమజ్జన వేళ సూరారం కట్టమైసమ్మ చెరువు పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ నరసింహారావు కోరారు. ముఖ్యంగా భారీ వాహనాల డ్రైవర్లు నిర్ణయించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.
నిమజ్జనానికి వచ్చే భక్తులు – వాహనదారులు పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో అనవసరంగా వాహనాలను నిలిపివేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా – సజావుగా జరిగేలా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి మార్గదర్శకత్వం లేదా ఇతర సమాచారం కోసం 87126 63584 నంబర్‌ను సంప్రదించవచ్చని జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ నరసింహారావు తెలిపారు.






