ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరలింపుపై ప్రజల ప్రశ్నలు.. ప్రభుత్వ సమాధానాలకు వార్డ్ మెంబర్ డిమాండ్
భిక్కనూరు, సెప్టెంబర్ 19 (నవజ్యోతి ప్రతినిధి): భిక్నూర్కు ప్రతిపాదించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను మరో ప్రాంతానికి తరలించడంపై 14వ వార్డు సభ్యుడు పెద్దబచ్చగారి జ్ఞాన ప్రకాష్ రెడ్డి ప్రశ్నలు సంధించారు. పాఠశాల తరలింపు నిర్ణయం తీసుకునే ముందు భిక్నూర్ ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నారా అని ప్రశ్నించారు. పాఠశాలకు అవసరమైన ప్రభుత్వ భూమి భిక్నూర్లో అందుబాటులో ఉంటే ఎందుకు వినియోగించలేదో అధికారులు సమాధానం చెప్పాలని కోరారు. పాఠశాలను భిక్నూర్లోనే నిలబెట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన ప్రయత్నాలేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి దగ్గరగా ఉండాలనేదే తరలింపునకు కారణమైతే, ఇప్పటికే ఎస్ఎస్ నగర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉన్న నేపథ్యంలో భిక్నూర్కు వచ్చిన అవకాశాన్ని మరో ప్రాంతానికి ఎందుకు మార్చారని ప్రశ్నించారు. భిక్నూర్లో ప్రభుత్వ విద్యాసంస్థ ఏర్పడితే ప్రైవేట్ విద్యాసంస్థల ప్రయోజనాలపై ప్రభావం పడుతుందనే కారణంతో ఎవరైనా తరలింపునకు ప్రయత్నించారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఫార్మా పరిశ్రమల వల్ల ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆరోగ్య, పర్యావరణ ఆందోళనలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని అన్నారు. పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రభుత్వ విద్యాసంస్థను భిక్నూర్లో నిలబెట్టలేకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. భిక్నూర్కు రావాల్సిన అభివృద్ధి అవకాశాలను కాపాడటం ప్రజాప్రతినిధుల బాధ్యత అని జ్ఞాన ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.






