హైదరాబాద్‌లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించిన TG SAFE అధికారులు భారీగా ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. కట్టేదాన్ సమీపంలోని ప్రేమావతిపేటలో సహిల్ ఫుడ్స్‌కు చెందిన ఐదు తయారీ యూనిట్లలో తనిఖీలు నిర్వహించి, లేబులింగ్‌లో లోపాలున్నట్లు గుర్తించిన 55 టన్నుల ఉత్పత్తులను సీజ్ చేశారు. వీటి విలువ రూ.33,94,115గా అధికారులు వెల్లడించారు. నాణ్యతపై అనుమానాలతో 11 నమూనాలను ప్రయోగశాల పరీక్షలకు పంపారు. నాలుగు యూనిట్ల ఆహార భద్రత లైసెన్సులు లేదా రిజిస్ట్రేషన్లను నిలిపివేసి, కార్యకలాపాలు ఆపాలని ఆదేశించారు.
అపరిశుభ్ర వాతావరణంలో తయారీ
తనిఖీల్లో దుమ్ము, పొగతో పేరుకుపోయిన యంత్రాలు, ఉత్పత్తి కన్వేయర్లలో ఆహార వ్యర్థాలు, సరైన గాలి ప్రసరణ లేకపోవడం, వ్యర్థాల నిర్వహణలో లోపాలను గుర్తించారు. కొందరు కార్మికులు తయారీ ప్రాంగణంలో గుట్కా లేదా పాన్ మసాలా నములుతున్నట్లు అధికారులు గుర్తించారు. సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను అపరిశుభ్రమైన బకెట్లలో నిల్వ చేయడంతో పాటు, కొన్ని ఆహార ఉత్పత్తులను ప్యాలెట్లపై కాకుండా నేరుగా నేలపై ఉంచినట్లు వెల్లడించారు.
లైసెన్సులు, నాణ్యతా రికార్డుల్లో లోపాలు
తయారు చేస్తున్న కొన్ని ఆహార వర్గాలకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సుల్లో అనుమతులు లేవని తనిఖీ బృందాలు గుర్తించాయి. ఉత్పత్తి, విక్రయాల రికార్డులు నిర్వహించకపోవడంతో పాటు, ఉత్పత్తులపై ప్రకటించిన మూడు నెలల గడువు వినియోగ కాలానికి మద్దతుగా షెల్ఫ్ లైఫ్ అధ్యయన నివేదికలు చూపలేకపోయారని అధికారులు తెలిపారు. ఆహార పరీక్షలు, నీటి నాణ్యత విశ్లేషణకు సంబంధించిన రికార్డులు కూడా అందుబాటులో లేవని పేర్కొన్నారు. ఆహార భద్రతా ప్రమాణాల అమలును నిర్ధారించేందుకు తనిఖీలు కొనసాగిస్తామని TG SAFE వెల్లడించింది.