‘ది ప్యారడైజ్’ టికెట్ ధరలు పెంపు !
సెప్టెంబర్ 24న నాని సినిమా విడుదల
హీరో నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 24న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెంచిన టికెట్ ధరలు నిర్ణీత కాలానికి – రోజుకు ఐదు షోలకు వర్తించనున్నాయి.
సెప్టెంబర్ 23న సాయంత్రం 6:30 గంటలకు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. ఈ షోకు టికెట్ ధర రూ.500గా నిర్ణయించారు. ఇందులో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు ప్రతి టికెట్‌పై రూ.48, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు రూ.23 అదనంగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చారు.
మల్టీప్లెక్స్‌లు – ప్రత్యేక థియేటర్లలో సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు ప్రతి టికెట్‌పై రూ.95, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు రూ.45 అదనంగా వసూలు చేయవచ్చు. పెంచిన ధరలు రోజుకు ఐదు షోలకు మాత్రమే వర్తిస్తాయి.
సినిమా నిర్మాత సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ కమిటీ ఖాతాకు రూ.1 కోటి విరాళంగా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
థియేటర్లలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు – సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ప్రకటనలను ప్రదర్శించాలని కూడా థియేటర్ యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది.






