Wednesday, September 23, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
ప్రత్యేక కథనాలు

దేశంలోనే బెస్ట్‌ యాంటీ నార్కో ఫోర్స్ గా తెలంగాణ ‘ఈగల్‌’!

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా అవార్డు..ఈగల్‌ ఫోర్స్‌కు డీజీపీ సీవీ ఆనంద్‌ అభినందనలు
SAI MANIKANTA
September 22, 2026 · 11 hours క్రితం
11 Views 1 Shares

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 22 (నవజ్యోతి ప్రతినిధి):
మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్‌ ఈగల్‌ ఫోర్స్‌ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. దేశంలోనే అత్యుత్తమ యాంటీ నార్కోటిక్స్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ANTF)గా తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలో జరిగిన 3వ జాతీయ ఏఎన్‌టీఎఫ్‌ అధిపతుల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా ఈగల్‌ ఫోర్స్‌కు అవార్డు అందించారు.

ఈగల్‌ ఫోర్స్‌కు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సందీప్‌ శాండిల్య నాయకత్వం వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు ఈ గుర్తింపు రావడంపై డీజీపీ సీవీ ఆనంద్‌ హర్షం వ్యక్తం చేస్తూ ఈగల్‌ ఫోర్స్‌ సిబ్బందికి అభినందనలు తెలిపారు. మొత్తం తెలంగాణ పోలీస్‌ బలగానికి ఇది గర్వకారణమైన విజయమని పేర్కొన్నారు.

రెండు రోజులపాటు జరుగుతున్న జాతీయ సదస్సులో 2026-29 నార్కోటిక్స్‌ కంట్రోల్‌ విజన్‌ డాక్యుమెంట్‌ అమలు, నిర్దేశించిన లక్ష్యాల సాధన, దేశాన్ని డ్రగ్‌ ఫ్రీ భారత్‌గా మార్చేందుకు చేపట్టాల్సిన సమష్టి చర్యలపై చర్చిస్తున్నారు. సింథటిక్‌ డ్రగ్స్‌, క్లాండెస్టైన్‌ ల్యాబ్‌లపై నిఘా, డ్రగ్‌ కార్టెళ్లను ఛేదించడం, డార్క్‌నెట్‌ – క్రిప్టో కరెన్సీ ఆధారిత డ్రగ్‌ నెట్‌వర్క్‌లపై దర్యాప్తును బలోపేతం చేయడం వంటి అంశాలు సదస్సులో కీలకంగా ఉన్నాయి.

సైబర్‌ క్రైమ్‌ నియంత్రణలోనూ తెలంగాణ పోలీస్‌ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఉందని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. యాంటీ నార్కోటిక్స్‌ పనితీరుతో కలిపి పోలీసింగ్‌లో రెండు కీలక ప్రాధాన్యతా రంగాల్లో తెలంగాణ ముందంజలో నిలిచిందని పేర్కొన్నారు.

జాతీయ నేర చట్టాల అమలు, ఐసీజేఎస్‌ (ICJS), సీసీటీఎన్‌ఎస్‌ (CCTNS) వంటి ఇతర విభాగాల్లోనూ పనితీరును మెరుగుపర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు డీజీపీ తెలిపారు. సంబంధిత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ పోలీస్‌ మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా – వినియోగాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు లభించిన జాతీయ గుర్తింపు రాష్ట్ర పోలీస్‌ శాఖలో ఉత్సాహాన్ని నింపింది. అవార్డు సాధించిన ఈగల్‌ ఫోర్స్‌ అధికారులు – సిబ్బందిని డీజీపీ సీవీ ఆనంద్‌ అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.