సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఎస్సీ – ఎస్టీ అట్రాసిటీస్ చట్టం అమలుపై ఉన్నత స్థాయి సమీక్ష !
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నవజ్యోతి ప్రతినిధి):
ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాల నిరోధక చట్టం – 1989 అమలును మరింత పటిష్టం చేయడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర స్థాయి హైపవర్ విజిలెన్స్ – మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి.
సమావేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన లైంగిక దాడి బాధితులకు పరిహారం అందించే విషయంలో ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. బడ్జెట్ విడుదలలో జాప్యం కారణంగా బాధితులకు పరిహారం ఆలస్యం కాకుండా ‘గ్రీన్ ఛానల్’ విధానం ద్వారా పరిహారం నిధులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సకాలంలో ప్రభుత్వ సహాయం అందేలా ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, న్యాయస్థానాల్లో విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న సహాయం – పునరావాస చర్యలను సమావేశంలో సమీక్షించారు. చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు, మొబైల్ కోర్టుల పనితీరుపైనా చర్చించారు.
లైంగిక దాడి వంటి ఘటనలకు ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక – ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా సమావేశంలో ప్రస్తావించారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నట్లు సీఎం వివరించారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మొత్తం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఎస్సీలకు 31 శాతం, ఎస్టీలకు 17 శాతం ఇళ్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. దళిత – గిరిజన వర్గాలకు సన్నబియ్యం, పోషకాహారం అందించే కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.
విద్యతోనే సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొంటూ, పిల్లలను చదువుతో పాటు క్రీడల వైపు కూడా ప్రోత్సహించాలని సూచించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు సుమారు 27.5 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, మట్టా రాగమయి, వెడ్మ బొజ్జు, మురళి నాయక్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు హాజరయ్యారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఎస్సీ – ఎస్టీ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. చట్టం అమలు నుంచి బాధితులకు పరిహారం, పునరావాసం వరకు ప్రతి దశను సమీక్షిస్తూ ప్రభుత్వ సహాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవడమే సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశంగా నిలిచింది.






