పినరయి విజయన్‌కు ఈడీ సమన్లు!
న్యూఢిల్లీ: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సీఎంఆర్ఎల్–ఎక్సాలోజిక్ మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం అక్టోబర్ 23న హాజరు కావాలని ఆదేశించింది. ఈ పరిణామం చోటుచేసుకున్న సమయంలోనే తనతోపాటు కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ విజయన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన కుమార్తె వీణా టీ, అల్లుడు మహమ్మద్ రియాస్ కూడా ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ ఈ సమన్లు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని విజయన్ తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 26 లేదా 27న పిటిషన్‌ను జాబితా చేసే అవకాశం ఉందని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. న్యాయమూర్తుల లభ్యతను బట్టి సెలవుల్లో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించవచ్చని తెలిపారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అక్టోబర్ 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ విజయన్, వీణా, రియాస్ న్యాయపరమైన ఉపశమనం కోరుతున్నారు.
సింగిల్ జడ్జి రిట్ పిటిషన్లో ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు ఇవ్వడంపై విజయన్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించే అధికారం సంబంధిత ధర్మాసనానికి లేదని, ఆదేశాలు జారీ చేసే ముందు ప్రభావిత వ్యక్తుల వాదనలు వినలేదని వాదించారు. సింగిల్ జడ్జి ఆదేశాలపై అప్పీల్ చేసేందుకు అనుమతి కోరగా, కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ పిటిషన్లను తిరస్కరించింది.
అక్టోబర్ 15న ఇచ్చిన తీర్పులో, అప్పీల్‌కు అనుమతి ఇవ్వడానికి ప్రాథమికంగా సమర్థించదగిన లేదా విచారణార్హమైన కేసును పిటిషనర్లు చూపలేకపోయారని డివిజన్ బెంచ్ పేర్కొంది. అయితే తగిన రాజ్యాంగపరమైన లేదా చట్టపరమైన మార్గాల్లో పరిష్కారం కోరేందుకు ఆ ఉత్తర్వులు అడ్డంకి కావని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ, ఈడీ సమన్లకు సంబంధించిన పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.






