Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జనరల్

మిక్స్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో సుచికా సత్తా.. భారత్‌కు తొలి పతకం ఖాయం!

60 కేజీల విభాగంలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత క్రీడాకారిణి మంగోలియా క్రీడాకారిణిపై విజయం.. ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం!
SAI MANIKANTA
September 20, 2026 · 2 days క్రితం
20 Views 1 Shares
నాగోయా, సెప్టెంబర్‌ 20 (నవజ్యోతి ప్రతినిధి):

జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌ 2026లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. మహిళల సంప్రదాయ 60 కేజీల మిక్స్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ విభాగంలో భారత క్రీడాకారిణి సుచికా తారియాల్‌ సెమీఫైనల్‌కు చేరుకున్నారు. మంగోలియాకు చెందిన ఆల్టాన్‌చిమెగ్‌ బైగల్మాను ఓడించి ఈ ఘనత సాధించారు.

పోరులో ప్రత్యర్థి రెండో రౌండ్‌లో దూకుడుగా దాడులు చేసినప్పటికీ సుచికా తన రక్షణను సమర్థంగా కొనసాగించారు. కీలక సమయంలో ప్రత్యర్థిని కిందపడేసి నియంత్రణలోకి తీసుకున్న ఆమె.. రౌండ్‌ ముగిసే వరకు ఆధిపత్యాన్ని కొనసాగించి విజయం సాధించారు.

ఈ విజయంతో సుచికా సెమీఫైనల్‌కు చేరడంతో భారత్‌కు ఏషియన్‌ గేమ్స్‌లో తొలి పతకం ఖాయమైంది. మిక్స్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో సుచికా ప్రదర్శన భారత క్రీడా బృందానికి కీలక ఆరంభంగా నిలిచింది.

మరోవైపు మహిళల టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌ గ్రూప్‌-ఎఫ్‌ పోరును విజయంతో ప్రారంభించింది. ఇండోనేషియాపై భారత్‌ 3-0తో విజయం సాధించింది. స్రీజా ఆకుల 3-1తో ఎన్‌. మహరిన్‌పై గెలవగా.. దియా చితలే 3-0తో ఎ. నెబుచాడ్నెజర్‌పై, యశస్విని ఘోర్పడే 3-0తో సి. రస్మిపై విజయం సాధించారు.

మరోవైపు ఏషియన్‌ గేమ్స్‌లో తొలిసారిగా ప్రవేశించిన టెక్‌బాల్‌లో భారత మిక్స్‌డ్‌ డబుల్స్‌ జోడీ కాంస్య పతక పోరులో వియత్నాం చేతిలో 0-2తో ఓడింది. దీంతో టెక్‌బాల్‌లో భారత్‌కు ఉన్న మూడు పతక అవకాశాలు ముగిశాయి.