టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. ఏడు రౌండ్లు ఫైర్!
ముంబై: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై ముంబైలోని జుహూ ప్రాంతంలో ఆదివారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు సుమారు రాత్రి 7 గంటల సమయంలో ఏడు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఘటన సమయంలో కారులో ఉన్న డ్రైవర్ ఫిర్దోష్ ఎడమ చేతికి బుల్లెట్ గాయం కాగా, సమీపంలో నటుడిని చూసేందుకు నిలుచున్న ఉమేశ్ చరణ్ (35) కూడా గాయపడ్డాడు. డ్రైవర్‌ను నానావతి ఆసుపత్రికి, ఉమేశ్‌ను కూపర్ ఆసుపత్రికి తరలించారు. తొలుత అద్దాలు పగలడంతో వాటి ముక్కలు తగిలి నటుడికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం వెలువడినప్పటికీ, డీసీపీ మోహిత్ గార్గ్ మాత్రం టైగర్ ష్రాఫ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు.
జుహూలోని పుష్పా పార్క్ (జమ్నాబాయి నర్సరీ)లో జరిగిన పుట్టినరోజు వేడుకకు హాజరైన టైగర్ ష్రాఫ్ తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రదేశం జుహూ పోలీస్ స్టేషన్‌కు, పుష్పా పార్క్‌కు సుమారు 350 మీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించారు. తెల్లటి చొక్కాలు ధరించిన ముగ్గురు నిందితులు కాల్పుల అనంతరం ఎస్‌వీ రోడ్డు, విలే పార్లే రైల్వే స్టేషన్ వైపు పారిపోయినట్లు ప్రాథమిక సమాచారం. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జుహూ పోలీసులు, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కదలికలు, పరారీ మార్గాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నటుడికి ఇటీవల బెదిరింపు ఫోన్‌కాల్స్ లేదా హెచ్చరికలు వచ్చాయా అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు.
బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో పోస్టు.. ఇంకా నిర్ధారించని పోలీసులు: కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు అనిల్ పండిట్, హర్మన్ సంధు పేర్లతో సోషల్ మీడియాలో ఒక పోస్టు వెలువడినట్లు సమాచారం. సల్మాన్ ఖాన్‌తో టైగర్ ష్రాఫ్‌కు ఉన్న అనుబంధం లేదా కలిసి చేసిన పనుల కారణంగానే నటుడిని లక్ష్యంగా చేసుకున్నామని ఆ పోస్టులో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ముంబై చిత్ర పరిశ్రమలో సల్మాన్ ఖాన్‌తో పనిచేసిన ఇతరులనూ బెదిరించినట్లు సమాచారం. అయితే ఈ పోస్టు నిజమైనదా, దాని వెనుక ఉన్నవారికి లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధాలున్నాయా అనే అంశాలను పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ చేపట్టి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
విచారణ వేగవంతం చేయాలని ఫడ్నవీస్ ఆదేశం: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబై పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కేసును వేగంగా దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
బాలీవుడ్‌ను వెంటాడుతున్న బెదిరింపులు: ముంబై చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులపై గతంలోనూ బెదిరింపులు, కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలో గాయకుడు గురు రంధావా జిమ్ వెలుపల జరిగిన కాల్పులకు అనిల్ పండిట్ బాధ్యత వహించినట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ ఏడాది జూలైలో నటుడు ఆమిర్ ఖాన్‌పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపు పోస్టు వెలువడినట్లు వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 1న దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటనలో శుభమ్ లోంకర్ ముఠాతో సంబంధాలున్న వ్యక్తుల ప్రమేయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో ప్రస్తావించింది.
2024 అక్టోబర్ 12న మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ బాంద్రా ఈస్ట్‌లోని తన కుమారుడి కార్యాలయం వెలుపల కాల్పుల్లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో లారెన్స్ బిష్ణోయ్, అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో సంబంధాలున్నాయనే కోణంలో దర్యాప్తు సాగింది. అదే ఏడాది ఏప్రిల్ 14న బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వెలుపల మోటార్‌సైకిల్‌పై వచ్చిన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ దాడి వెనుక లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్ ఉన్నారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. తాజా ఘటనతో బాలీవుడ్ ప్రముఖుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.






