Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జనరల్

భూసమస్య పరిష్కారానికి రీసర్వే ఏకైక మార్గం !

తొలి దశలో 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వే నక్షాలు లేని మరో 413 గ్రామాల్లోనూ దశలవారీగా సమగ్ర భూసర్వే
SAI MANIKANTA
September 29, 2026 · 11 hours క్రితం
◉ 44 Views ↗ 3 Shares

వనపర్తి, సెప్టెంబర్‌ 29 (నవజ్యోతి ప్రతినిధి):

రాష్ట్రంలో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమగ్ర భూసర్వే చేపట్టడం అత్యంత కీలకమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్గదర్శకత్వంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూసమస్యల్లో కొన్నింటిని ఇప్పటికే పరిష్కరించామని, మరికొన్నింటికి త్వరలో పరిష్కారం చూపుతామని చెప్పారు.

వనపర్తిలో సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, హౌసింగ్‌ అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. గతంలో మాదిరిగా కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజల కోణంలో భూసమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు.

70 గ్రామాల్లో తొలి దశ సర్వే
భూ భారతి కింద తొలి దశలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేయగా.. నక్షాలు లేని మరో 413 గ్రామాల్లోనూ దశలవారీగా సర్వే చేపట్టనున్నారు.

భూ భారతి కింద ప్రతి భూ పార్శిల్‌కు ప్రత్యేక గుర్తింపు, జియో కోఆర్డినేట్లతో కూడిన మ్యాప్‌, ఎల్‌పీఎం నంబర్‌ అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. ధరణి చట్టం సమయంలో ప్రజలు ఎదుర్కొన్న అసౌకర్యాలు, ఇబ్బందులను తొలగిస్తూ భూ భారతి పోర్టల్‌లో పేర్కొన్న విధంగా భూధార్‌ కార్డులు అందించడమే లక్ష్యమన్నారు.

భూసర్వేను వేగవంతం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలను పెద్దఎత్తున సమకూర్చినట్లు తెలిపారు. తొలి దశలో కొనుగోలు చేసిన రోవర్లతో పాటు రెండో దశలో అదనపు రోవర్లను కూడా అందుబాటులోకి తెచ్చి జిల్లాల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తున్నామని చెప్పారు. వేలాది మంది సర్వేయర్లకు లైసెన్సులు మంజూరు చేసి క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.

దశాబ్దాలుగా భూములను సాగు చేస్తున్నప్పటికీ సరైన టైటిల్‌ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల సమస్యలను గుర్తించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సాదాబైనామాలు, భూ హద్దుల వివాదాలు, పాత రికార్డుల్లో లోపాలు, అబాది ఆస్తుల వివరాలు వంటి సమస్యలకు సమగ్ర సర్వే ద్వారా పరిష్కారం చూపవచ్చన్నారు.

గ్రామాల్లో ఇళ్ల స్థలాలు, నివాస ప్రాంతాలు, అబాది ఆస్తులకు సంబంధించి గతంలో స్పష్టమైన మ్యాపింగ్‌ లేని సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఇకపై సర్వే ద్వారా ఆయా ఆస్తుల విస్తీర్ణం, హద్దులను మ్యాప్‌తో సహా రికార్డుల్లో నమోదు చేస్తామని తెలిపారు. అబాది, వ్యవసాయేతర భూములకు ప్రత్యేక రికార్డులు నిర్వహిస్తూ వాటి మూలలను జియో కోఆర్డినేట్లతో మ్యాప్‌ చేసే విధంగా భూ భారతి చట్టంలో నిబంధనలు ఉన్నాయని వివరించారు.

ఇందిరమ్మ ఇళ్లలో రాజకీయాలకు తావులేదు
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు.

భూసమస్యల పరిష్కారంతో పాటు పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పొంగులేటి తెలిపారు. తొలి విడతలో మంజూరైన 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో రెండు లక్షలకు పైగా ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. రెండో విడతలో గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పేదల ఇళ్లకు కూడా ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. రెండో విడతలో అవకాశం రాని అర్హులైన పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మూడో, నాలుగో విడతల ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram