‘మైసా’లో రష్మిక రౌద్రావతారం
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నవజ్యోతి ప్రతినిధి):
విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రష్మిక మందన్న మరో కొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ టీజర్ విడుదలైంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటివరకు రష్మిక చేసిన పాత్రలకు భిన్నంగా ‘మైసా’లో గిరిజన గోండు యువతిగా కనిపించనున్నారు. తండ్రి కోసం, తన ప్రజల హక్కుల కోసం పోరాటానికి సిద్ధమైన యువతి కథగా సినిమా సాగనున్నట్లు టీజర్లో చూపించారు. ఆవేశం, ధైర్యం, ప్రతీకారం మేళవించిన పాత్రలో రష్మిక యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
బైక్‌పై దూసుకెళ్లడం, నీటిలో పోరాటాలు, బురదలో సాగే యాక్షన్ సన్నివేశాలతో టీజర్‌ను తీర్చిదిద్దారు. చిత్రీకరణలో భాగంగా దాదాపు ఎనిమిది గంటలపాటు నీరు, బురదలో సాహసోపేత సన్నివేశాల్లో పాల్గొన్నట్లు రష్మిక వెల్లడించారు.
జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం అందిస్తుండగా, శ్రేయాస్ కె. కృష్ణ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈశ్వరి రావు, రావు రమేష్, సముద్రఖని, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 27న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.






