పీఎం మోదీకి రామ్‌చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
1,000 మంది మహిళలకు నైపుణ్య శిక్షణ అందిస్తానని హామీ..‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగస్వామి అవుతున్నట్లు ప్రకటన
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భం“గా ప్రముఖ నటుడు రామ్‌చరణ్ గురువారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే నెలల్లో 1,000 మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించనున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన ‘సేవా సంకల్ప్ అభియాన్’లో తాను కూడా భాగస్వామి అవుతున్నట్లు వెల్లడించారు.
ఎక్స్ వేదికగా రామ్‌చరణ్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీకు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, సంతోషం – శక్తి కలగాలని కోరుకుంటున్నాను. వికసిత్ భారత్ కోసం మీ నాయకత్వం – దూరదృష్టి దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ దేశానికి చేస్తున్న అలుపెరగని కృషి – నిస్వార్థ సేవ తనను ఎంతగానో ప్రభావితం చేశాయని రామ్‌చరణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ‘సేవా సంకల్ప్ అభియాన్’లో తన వంతుగా 1,000 మంది మహిళలకు రాబోయే నెలల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తానని ప్రతిజ్ఞ చేశారు.
ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ కార్యక్రమంలో ప్రజాసేవ – సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పలు కార్యక్రమాలను చేపడుతున్నారు.






