Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
ఆంధ్రప్రదేశ్

పోర్షే ఢీకొట్టడంతో విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు మృతి !

SAI MANIKANTA
September 18, 2026 · 4 days క్రితం
5 Views 1 Shares

ఒకే కుటుంబానికి చెందిన అత్త – కోడలు దుర్మరణం-సీసీటీవీ – డాష్‌క్యామ్‌ ఫుటేజీ కోసం పోలీసుల దర్యాప్తు…మృతదేహాలను విశాఖకు తరలించేందుకు తెలుగు సమాజం సహాయం

మెల్‌బోర్న్, సెప్టెంబర్ 18 (నవజ్యోతి ప్రతినిధి):

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. సెప్టెంబర్‌ 16 రాత్రి పాయింట్‌ కుక్‌లోని బోర్డ్‌వాక్‌ బులేవార్డ్‌ – ఇన్నిస్‌ఫెయిల్‌ డ్రైవ్‌ కూడలిలో రాత్రి 9.40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

మృతులను విశాఖపట్నానికి చెందిన బొమ్మాలి నేహా (33), ఆమె అత్త రామాదేవి (67)గా గుర్తించారు. నేహా టయోటా కారును నడుపుతుండగా, రామాదేవి ఆమె పక్కన కూర్చున్నారు. మరో కారులో నేహా మామ – రిటైర్డ్‌ షిప్‌యార్డ్‌ ఉద్యోగి జీటీ ప్రసాద్‌ వెనుక నుంచి ప్రయాణిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

60 కిలోమీటర్ల వేగ పరిమితి ఉన్న ప్రాంతంలో పోర్షే మాకాన్‌ కారు టయోటాను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. పోర్షేను 53 ఏళ్ల వ్యక్తి నడుపుతున్నాడు. ప్రమాదంలో నేహా – రామాదేవి మృతి చెందగా, పోర్షే డ్రైవర్‌ గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించేందుకు విక్టోరియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ, డాష్‌క్యామ్‌ వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి ముందు రెండు వాహనాలను చూసినవారు లేదా తమ వద్ద సంబంధిత ఫుటేజీ ఉన్నవారు పోలీసులను సంప్రదించాలని అధికారులు కోరారు.

రామాదేవి భర్త జీటీ ప్రసాద్‌ విశాఖలోని సీతమ్మధార ఎన్‌ఈ లేఅవుట్‌లో నివసిస్తున్నారు. ఆయన విశాఖపట్నం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌లో జాయింట్‌ సెక్రటరీ – ట్రెజరర్‌గా కూడా పనిచేశారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, కుమారుడు – కోడలి ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యేందుకు రామాదేవి – ప్రసాద్‌ ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లారు.

నేహా – ఆమె భర్తకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్నారుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన రామాదేవి కూడా ఈ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు సుమారు పది రోజుల సమయం పట్టే అవకాశం ఉందని బంధువులు తెలిపారు. మృతదేహాలను విశాఖపట్నానికి తీసుకురావడానికి ఆస్ట్రేలియాలోని తెలుగు సమాజం సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ఇందుకోసం నిధుల సేకరణ కూడా ప్రారంభించినట్లు సమాచారం.