తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నవజ్యోతి ప్రతినిధి):
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ తెలంగాణ చరిత్ర – సంస్కృతి – శిల్పకళకు ప్రతీకలుగా నిలిచేలా నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ మూడు నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ చరిత్రకు, సంస్కృతికి ప్రతిరూపాలుగా నిలిచిన కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయం వంటి కట్టడాల్లోని శిల్ప – వాస్తు కళలను పరిశీలించి, వాటి ప్రత్యేకతలు ప్రతిబింబించేలా కొత్త నిర్మాణాల డిజైన్లను రూపొందించాలని సీఎం సూచించారు. విమానాశ్రయాలు, తెలంగాణ భవన్ కేవలం ఆధునిక మౌలిక వసతులుగా కాకుండా తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పే నిర్మాణాలుగా ఉండాలని స్పష్టం చేశారు.
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల మార్పు, వాగుల ప్రవాహాల మళ్లింపు, రహదారుల మార్పు, బీఎస్ఎన్ఎల్ లైన్లు, తాగునీటి సరఫరా పైపులైన్ల మార్పు తదితర అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆయా పనులపై పూర్తి వివరాలను తెలుసుకున్న సీఎం, శాఖల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
విమానాశ్రయాల కాంపౌండ్ వాల్ సమీపం నుంచి రహదారులు నిర్మించి, వాటిని సమీప జిల్లా, రాష్ట్ర – జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. విమానాశ్రయాలకు రాకపోకలు సులభంగా ఉండేలా రహదారులు విశాలంగా, మెరుగైన కనెక్టివిటీతో ఉండాలని సూచించారు.
ఒక్కో శాఖ విడివిడిగా పనులు చేపడితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. విద్యుత్, ఆర్అండ్బీ, తాగునీటి సరఫరా, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ బీఎస్ఎన్ఎల్ అధికారులతోనూ చర్చించి అన్ని పనులను ఏకకాలంలో చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్తులో పెరిగే అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని రేవంత్రెడ్డి సూచించారు. వాగులు, ఇతర నీటి ప్రవాహాలను మళ్లించాల్సిన పరిస్థితి ఉంటే విమానాశ్రయ ప్రాంగణంలో లేదా సమీప ప్రాంతాల్లో చెరువులు నిర్మించి, వాటి ద్వారా నీటి ప్రవాహాలను మళ్లించే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు.
విమానాశ్రయాలకు వచ్చే – వెళ్లే రహదారులను విశాలంగా నిర్మించడంతో పాటు సమీపంలోని ప్రధాన రహదారులకు అనుసంధానం చేయాలని, నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మౌలిక వసతుల నిర్మాణంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టాలని సూచించారు.
సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, కిరణ్ చామల, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్కు సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించి, పలు ఆకృతుల్లో మార్పులు – చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు.






