Monday, September 21, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
తెలంగాణ

22ఏ భూ సమస్యలకు ఇక పరిష్కారమే!

సీసీఎల్‌ఏ చైర్మన్‌గా ఉన్నతస్థాయి కమిటీ జీఓ 118 కింద 9,792 దరఖాస్తుల క్రమబద్ధీకరణ 12 రకాల సమస్యలను నెలలోపు పరిష్కరించే యత్నం
SAI MANIKANTA
September 19, 2026 · 3 days క్రితం
11 Views 1 Shares

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (నవజ్యోతి ప్రతినిధి):

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన 22ఏ నిషేధిత జాబితా భూ సమస్యలకు వేగంగా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ సమస్యలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు – వివాదాలను పరిశీలించి పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ ఆర్‌టీ నంబర్‌ 564 జారీ చేసింది. 1

శుక్రవారం శాసనసభలో జీరో అవర్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 22ఏ అంశంపై ప్రత్యేక ప్రకటన చేశారు. 22ఏ కింద ఉన్న భూ సమస్యల్లో ప్రభుత్వం మొత్తం 12 రకాల అంశాలను గుర్తించిందని, వీటిని గరిష్ఠంగా నెలరోజుల్లో పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 2

ఉన్నతస్థాయి కమిటీకి భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ డీఎస్‌.లోకేశ్‌కుమార్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి, స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హన్మంతు సభ్యులుగా ఉంటారు. ఐజీ రాజీవ్‌గాంధీ హన్మంతు మెంబర్‌ కన్వీనర్‌గా కూడా వ్యవహరిస్తారు. 3

ఎల్బీనగర్‌ నియోజకవర్గ పరిధిలో జీఓ 118 కింద క్రమబద్ధీకరణ కోసం 9,792 మంది దరఖాస్తు చేసుకున్న విషయం కూడా మంత్రి ప్రస్తావించారు. వీటిని పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ శుక్రవారం మెమో జారీ చేసింది. అర్హత ఉన్న దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించనున్నారు. 4

ఎల్బీనగర్‌ పరిధిలోని సుమారు 22-23 కాలనీలకు సంబంధించిన ఈ సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా దరఖాస్తులను పరిష్కరించాలని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. అర్హత ఉన్న వారికి క్రమబద్ధీకరణ అనంతరం ఆయా ఆస్తులను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టనున్నారు. 5

సింగరేణి ప్రాంతంలోని ఇళ్ల స్థలాల సమస్యపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ చేసిన జీఓ 76కు సంబంధించిన అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి, అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 6

ఇదే సమయంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వంటి అనుమతి సంస్థల నుంచి ఆమోదం పొందిన లేఅవుట్లు 22ఏ నిషేధిత జాబితాలో ఉండటం వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన అంశంపైనా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఇలాంటి లేఅవుట్లు – కాలనీలపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. 7

కమిటీ కేవలం దరఖాస్తుల పరిశీలనకే పరిమితం కాకుండా 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులకు సంబంధించిన పెండింగ్‌ కేసులను పరిశీలించనుంది. అవసరమైన రికార్డులు – సమాచారాన్ని సంబంధిత శాఖలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్ల నుంచి కోరే అధికారం కమిటీకి కల్పించారు. అవసరమైతే ఇతర అధికారులను సహ సభ్యులుగా చేర్చుకునే అవకాశం కూడా ఉంది.

ప్రభుత్వం గుర్తించిన 12 అంశాల్లో జీఓ 118 కింద క్రమబద్ధీకరణతో పాటు అనుమతులు పొందిన లేఅవుట్ల సమస్యలు, సింగరేణి ఇళ్ల స్థలాలు, సికింద్రాబాద్‌లో లీజుహోల్డ్‌ ఆస్తులను ఫ్రీహోల్డ్‌గా మార్చే అంశం వంటి సమస్యలు ఉన్నాయి. దీర్ఘకాలంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన ఆస్తులకు ఈ ప్రక్రియ ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంది. 8

22ఏ సమస్యలపై ప్రభుత్వం చేపట్టిన చర్యలు అమలైతే నిషేధిత జాబితాలో ఆస్తులు ఉండటం వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన వేలాది మంది దరఖాస్తుదారులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే ప్రతి కేసులో అర్హత, రికార్డులు – కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోనున్నారు. 9

22ఏ కింద 12 రకాల సమస్యలు.. నెలలోపు పరిష్కారానికి కమిటీ
జీఓ 118 కింద 9,792 దరఖాస్తులు.. ఎల్బీనగర్‌లో క్రమబద్ధీకరణకు చర్యలు
హెచ్‌ఎండీఏ – డీటీసీపీ – జీహెచ్‌ఎంసీ ఆమోదిత లేఅవుట్లపై త్వరలో నిర్ణయం
సింగరేణి ఇళ్ల స్థలాల సమస్యపై జీఓ 76కు పరిష్కారం దిశగా చర్యలు