నడిచే దారి లేదు.. మురుగు తప్ప! అర కిలోమీటరు మేర రోడ్డుపై మురుగు.. ప్రజారోగ్యంపై ఆందోళన
కుత్బుల్లాపూర్, అక్టోబర్ 7 (నవజ్యోతి ప్రతినిధి)
ప్రధాన రహదారి.. నిత్యం రద్దీగా ఉండే మార్గం.. కానీ ప్రస్తుతం మురుగునీటితో నిండిపోయింది. గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహాదేవపురం డివిజన్ కైలాష్‌హిల్స్ కమాన్ ప్రధాన రహదారి మురుగు కాలువను తలపిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థలో ఏర్పడిన లోపంతో సుమారు అర కిలోమీటరు మేర మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డుపై మురుగు.. రాకపోకలకు ఇబ్బందులు
వాహనాలు వెళ్లే సమయంలో మురుగునీరు పాదచారులపై చిమ్ముతుండటంతో అవస్థలు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు.
గత రెండు, మూడు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు చెబుతున్నారు. రహదారిపై మురుగునీరు నిలిచి ఉండటంతో దుర్వాసనతో పాటు ప్రజారోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించాలి
సంబంధిత హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ లోపాన్ని గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా మరమ్మతులు చేపట్టి రహదారిపై మురుగునీటి ప్రవాహాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల డిమాండ్: డ్రైనేజీ సమస్యను తక్షణమే పరిష్కరించి రహదారిని రాకపోకలకు అనుకూలంగా మార్చాలి.
నవజ్యోతి తెలుగు డైలీ — ప్రజల కోసం.. ప్రజల గొంతుక