తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో దారుణ హత్య!
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో అర్ధరాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కొండ శ్రీరాములు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఘటనతో గ్రామంలో తీవ్ర కలకలం నెలకొంది.
పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. శ్రీరాములు బోర్‌వెల్ పనులు చేస్తూ సంపాదించిన డబ్బులను కుటుంబానికి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇతర మహిళలతో తిరుగుతున్నాడని భార్య సబిత (40) ఆరోపించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సబిత తన కుమారుడు భారత్ (20)తో కలిసి శ్రీరాములుపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో కళ్లలో కారం పోసి, బండరాయితో ముఖంపై కొట్టినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన శ్రీరాములు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఘటన అనంతరం సబిత – భారత్ తూప్రాన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను పోలీసులు విచారిస్తున్నారు.
సమాచారం అందుకున్న తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకట్ రాజా గౌడ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీరాములుకు ఒక కుమారుడు – ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు సమాచారం.
కుటుంబ కలహాలు హత్యకు దారితీసినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ, ఘటనకు సంబంధించి పూర్తి కారణాలు – దాడి జరిగిన పరిస్థితులపై పోలీసుల దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.






