సెమీకండక్టర్ పరిశోధనలో ఐఐటీ హైదరాబాద్ కీలక ముందడుగు
హైదరాబాద్, అక్టోబర్ 13 (నవజ్యోతి ప్రతినిధి): విద్యా, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించే దిశగా ఐఐటీ హైదరాబాద్ మరో కీలక ముందడుగు వేసింది. జపాన్‌లోని మియే విశ్వవిద్యాలయంతో విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి, సంయుక్త పరిశోధనలకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. సెప్టెంబర్ 15న ఐఐటీ హైదరాబాద్‌లో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ముఖ్యంగా సెమీకండక్టర్లు, డిజిటల్ సాంకేతికతల అభివృద్ధిపై రెండు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. ఒప్పందాల ప్రకారం అధ్యాపకులు, సిబ్బంది మార్పిడి, సంయుక్త పరిశోధనలు, విద్యా సదస్సులు, ఉపన్యాసాలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఒకటి నుంచి రెండు సెమిస్టర్ల వరకు పరస్పర మార్పిడి అవకాశాలు కల్పించనున్నారు. జపాన్‌లోని మియే ప్రాంతం సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది. అక్కడి పరిశ్రమలతో అనుసంధానం ద్వారా విద్యార్థులకు పరిశోధన, సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకునే అవకాశాలు లభించనున్నాయి. మియే విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హిడెటో మియాకే మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం యువ పరిశోధకులకు కొత్త అవకాశాలు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి మాట్లాడుతూ భారత్, జపాన్ మధ్య విద్యా, సాంకేతిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలకు ఈ ఒప్పందాలు దోహదపడతాయని వివరించారు. సెమీకండక్టర్ రంగంలో నూతన ఆవిష్కరణలకు రెండు సంస్థల నైపుణ్యాన్ని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు తరుణ్ కె.పాండా, చంద్రశేఖర్ మురపాక, శివ్ గోవింద్ సింగ్, జపాన్ పరిశ్రమ ప్రతినిధి తకుయా నిషిమురా పాల్గొన్నారు.






