Tuesday, September 29, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
ప్రత్యేక కథనాలు

దొడ్డు బియ్యం.. రేషన్ డీలర్లకు దిక్కుతోచని పరిస్థితి!

18 నెలలుగా కదలని పాత స్టాక్‌.. తరుగు వస్తే 6-ఏ కేసుల భయం రాష్ట్రవ్యాప్తంగా వేలాది డీలర్లపై పాత బియ్యం భారం
SAI MANIKANTA
September 29, 2026 · 8 hours క్రితం
◉ 755 Views ↗ 9 Shares

హైదరాబాద్‌/ కామారెడ్డి సెప్టెంబర్‌ 29 (నవజ్యోతి ప్రతినిధి):

సన్నబియ్యం పంపిణీ ప్రారంభమై 18 నెలలు దాటినా రాష్ట్రంలోని పలు గ్రామీణ ప్రాంత రేషన్‌ డీలర్ల వద్ద మిగిలిపోయిన దొడ్డు బియ్యం సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం మారిన తర్వాత పాత దొడ్డు బియ్యం స్టాక్‌ను సకాలంలో తరలించకపోవడంతో.. ఆ బియ్యం నెలల తరబడి రేషన్‌ దుకాణాల్లోనే ఉండిపోయిందని డీలర్లు చెబుతున్నారు. ఇప్పుడు పాత క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ ప్రకారం బియ్యం ఉండాలని, తేడా వస్తే 6-ఏ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో పాత దొడ్డు బియ్యం భారీగా నిల్వ ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వ లెక్కలు, కోర్టు రికార్డుల్లో ప్రస్తావనకు వచ్చింది. 2026 సెప్టెంబర్‌లో వచ్చిన నివేదికల ప్రకారం తెలంగాణలో సుమారు 1.40 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యం వివిధ స్థాయిల్లో నిల్వ ఉండగా, అందులో 25 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా రేషన్‌ డీలర్ల వద్దే ఉన్నట్లు పేర్కొన్నారు. పాత స్టాక్‌ను తొలగించేందుకు ప్రభుత్వం వేలం ప్రక్రియ చేపట్టినట్లు హైకోర్టు రికార్డుల్లోనూ ఉంది.

కామారెడ్డి.. రాష్ట్ర సమస్యకు ఒక ఉదాహరణ
ఈ సమస్య తీవ్రతకు కామారెడ్డి జిల్లా లెక్కలు ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయి. జిల్లా రికార్డుల ప్రకారం 2025 మార్చి 27 నాటికి 6,95,634 కిలోలు.. అంటే 6,956 క్వింటాళ్లు 34 కిలోల దొడ్డు బియ్యం క్లోజింగ్‌ బ్యాలెన్స్‌గా నమోదైంది. సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత మిగిలిన ఈ స్టాక్‌లో కొంత భాగం ఇప్పటికీ గ్రామీణ ప్రాంత డీలర్ల వద్దే ఉందని వారు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా సమస్య ఉందని డీలర్లు పేర్కొంటున్నారు.

ఎక్కువకాలం నిల్వ ఉన్న బియ్యంలో తేమ తగ్గడం, పురుగు పట్టడం, ఎలుకల నష్టం, గింజలు విరగడం వంటి కారణాలతో సహజంగా బరువు తగ్గే అవకాశం ఉందని డీలర్లు చెబుతున్నారు. అయితే 18 నెలల క్రితం నమోదైన క్లోజింగ్‌ బ్యాలెన్స్‌తో ప్రస్తుత నిల్వను పోల్చి కొరతగా పరిగణిస్తే తమపై 6-ఏ చర్యలు పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

“పాత బియ్యాన్ని సకాలంలో తరలించకుండా మా దుకాణాల్లోనే ఉంచారు. ఇప్పుడు 18 నెలల తర్వాత కూడా అప్పటి బరువే ఉండాలని చెబితే ఎలా?” అని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. సహజంగా ఏర్పడే తరుగు, నిల్వ నష్టం, అక్రమంగా మళ్లించిన బియ్యం.. ఈ మూడింటినీ ఒకే కోణంలో చూడకుండా స్పష్టమైన లెక్కలు వేయాలని కోరుతున్నారు.

పాత దొడ్డు బియ్యం విషయంలో హైకోర్టులో నమోదైన కేసులు కూడా డీలర్ల ఆందోళనకు అద్దం పడుతున్నాయి. ఒక కేసులో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత పాత దొడ్డు బియ్యం రేషన్‌ షాపులో మిగిలిపోయిందని, దాన్ని తరలించాలని డీలర్‌ అధికారులను కోరినా చర్య తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అనంతరం తనిఖీలో 5.20 కిలోల కొరత గుర్తించి 6-ఏ చర్యలు ప్రారంభించినట్లు కోర్టు రికార్డులో ఉంది. మరో కేసులో పీడీఎస్‌ స్టాక్‌లో 487 కిలోల వ్యత్యాసంపై వివాదం హైకోర్టుకు వెళ్లింది.

పాత దొడ్డు బియ్యాన్ని తొలగించేందుకు ప్రభుత్వం వేలం ప్రక్రియ చేపట్టినట్లు కోర్టు రికార్డుల్లో ఉంది. ఒక దశలో కిలో రూ.24 ప్రాథమిక ధరతో టెండర్‌ పిలిచి స్పందన రాకపోవడంతో ధరను రూ.21.60కు తగ్గించినట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించింది. అయినా డీలర్ల వద్ద మిగిలిన స్టాక్‌ విషయంలో పూర్తి స్థాయి పరిష్కారం కనిపించకపోవడంతో సమస్య కొనసాగుతోందని వారు చెబుతున్నారు.

డీలర్‌ దుకాణం.. ప్రభుత్వ గోదామా?
18 నెలలుగా ప్రభుత్వ పాత స్టాక్‌ను తమ దుకాణాల్లోనే భద్రపరుస్తున్నామని డీలర్లు చెబుతున్నారు. పరిమితంగా ఉండే రేషన్‌ షాపుల స్థలాన్ని ఇంతకాలం పాత బియ్యం ఆక్రమించి ఉండటంతో ఇతర స్టాక్‌ నిర్వహణలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ప్రభుత్వ గోదాములో నిల్వ చేస్తే ఖర్చు ఉండే బియ్యాన్ని.. డీలర్‌ దుకాణంలో నెలల తరబడి ఉంచినప్పుడు నిల్వ వ్యయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా మళ్లించడం, నల్లబజారుకు తరలించడం, తప్పుడు లెక్కలు చూపించడం వంటి అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోవడంపై తమకు అభ్యంతరం లేదని డీలర్లు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ విధాన మార్పుతో మిగిలిపోయిన పాత స్టాక్‌కు జరిగిన సహజ నష్టాన్ని అక్రమ కొరతగా పరిగణించవద్దని కోరుతున్నారు.

“తప్పు చేసిన డీలర్‌పై చర్య తీసుకోవాలి.. కానీ ప్రభుత్వ విధానం మారడంతో మిగిలిపోయిన పాత బియ్యానికి 18 నెలల తర్వాత వచ్చిన సహజ తరుగు మొత్తాన్ని డీలర్‌ బాధ్యతగా మార్చొద్దు” అని వారు కోరుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పాత దొడ్డు బియ్యం నిల్వపై ప్రభుత్వం సమగ్ర లెక్కలు వెల్లడించాలని డీలర్లు కోరుతున్నారు. జిల్లాల వారీగా ఎంత క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ ఉంది? ప్రస్తుతం ఎంత స్టాక్‌ మిగిలింది? ఎంత తరలించారు? ఎంత వేలం వేశారు? ఎంత పాడైంది? సహజ తరుగు ఎలా లెక్కిస్తున్నారు? ఎన్ని 6-ఏ కేసులు నమోదయ్యాయి? అనే వివరాలను ప్రజలకు వెల్లడించాలని కోరుతున్నారు. ప్రభుత్వ విధానం మారడంతో మిగిలిపోయిన పాత స్టాక్‌ సమస్యకు పరిష్కారం చూపకుండా.. దాని సహజ తరుగు భారం కూడా డీలర్లపైనే పడితే పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు రాష్ట్రంలోని గ్రామీణ రేషన్‌ డీలర్ల ప్రధాన ప్రశ్న.

ప్రధాన డిమాండ్‌: పాత దొడ్డు బియ్యానికి సంబంధించి సహజ తరుగు, నిల్వ నష్టం, అక్రమ కొరతను వేర్వేరుగా లెక్కించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని డీలర్లు కోరుతున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram